అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్‌లో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. స్థానిక మైనారిటీ నాయకుడి స్మారక కార్యక్రమం జరుగుతుండగా ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులకు తెగించాడు. ఈ దుర్ఘటనలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 29 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించారు.
షియా నాయకుడి స్మారకార్థం..
మైనారిటీ షియా నాయకుడు అబ్దుల్ అలీ మజారా 25వ వర్ధంతి సందర్భంగా కాబుల్‌కు సమీపంలోని డాషే బార్చి ప్రాంతంలో స్మారక కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పలువురు అగ్రనేతలు పాల్గొన్నారు. గతేడాది అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన అబ్దుల్లా అబ్దుల్లా సహా పలువురు నేతలు కాల్పుల నుంచి తప్పించుకున్నారు.
ముమ్మర తనిఖీలు..
కాల్పులు జరిగిన ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి అఫ్గాన్ భద్రతా దళాలు. నిర్మాణంలో ఉన్న ఓ భవంతిలో దుండగుడు నక్కినట్లు గుర్తించారు. అతన్ని మట్టుబెట్టేందుకు తనిఖీలు చేపట్టాయి.
ఖండించిన తాలిబన్..
స్మారక కార్యక్రమంలో కాల్పుల ఘటనకు తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించింది తాలిబన్ సంస్థ. అమెరికా-తాలిబన్ల మధ్య ఇటీవల శాంతి ఒప్పందం జరిగిన తర్వాత కాబుల్ నగరంలో ఈ స్థాయిలో దాడి జరగడం ఇదే తొలిసారి.
ఇదీ చూడండి: ఆఫ్గాన్ ఆంక్షల చట్రంలో మహిళల దుర్భర జీవనం