ప్రపంచంపై కరోనా రక్కసి ఉగ్రరూపం కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారికి రోజూ వేలాదిమంది బలవుతూనే ఉన్నారు. కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 22 లక్షలు దాటింది. 1,47,478 మంది వైరస్ సోకి ప్రాణాలు వదిలారు.
స్పెయిన్
ఐరోపా దేశాల్లో ఈ వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది. గత 24 గంటల వ్యవధిలో స్పెయిన్‌లో 585 మంది మృతిచెందారు. దీంతో దేశంలో మరణాల సంఖ్య 19,478కి చేరింది. అయితే మృతుల లెక్కింపు విధానంలో మార్పులు చేస్తున్నందున గత మరణాలతో ఈ సంఖ్యను పోల్చి చూడలేమని స్పెయిన్ ప్రభుత్వం స్పష్టం చేసింది.
బెల్జియం మరణాలు @5000
బెల్జియంలో కరోనా మరణాల సంఖ్య 5 వేలు దాటింది. గత 24 గంటల్లో 313 మరణాలతో మొత్తం మృతుల సంఖ్య 5,163కి చేరినట్లు అధికారులు తెలిపారు. ఐరోపాలోని ఇతర దేశాలతో పోలిస్తే అధిక మరణాల రేటు ఉన్నట్లు ధ్రువీకరించారు. సగం మరణాలు వృద్ధాశ్రమాల్లో నమోదు కాగా.. మిగిలిన సగం మరణాలు ఆస్పత్రులలో సంభవించినట్లు పేర్కొన్నారు.
రష్యాలో ఒక్క రోజే 4070 కేసులు
రష్యాలో వైరస్ కేసులు 32 వేలకు చేరినట్లు అధికారులు ప్రకటించారు. 24 గంటల్లోనే 4070 కేసులు నమోదైనట్లు తెలిపారు. మరో 41 మంది మరణించడం వల్ల మృతుల సంఖ్య 273కి చేరినట్లు స్పష్టం చేశారు. కొత్తగా నమోదైన కేసుల్లో సగానికి పైగా మాస్కోలోనే గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. రెండు, మూడు వారాల్లో వైరస్ తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఇరాన్లో తగ్గుముఖం
ఇరాన్లో కరోనా ప్రభావం తగ్గుతోంది. గత 6 రోజుల నుంచి మరణాల రేటు తగ్గినట్లు అధికారులు తెలిపారు. ఇవాళ మరో 89 మంది మరణించినట్లు వైద్య శాఖ ప్రతినిధి కియానౌష్ జహాన్‌పోర్ తెలిపారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,958కి చేరినట్లు స్పష్టం చేశారు.
గత 24 గంటల్లో 1,499 కొత్త కేసులు నమోదైనట్లు కియానౌష్ వెల్లడించారు. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 79,494కి చేరినట్లు తెలిపారు. మొత్తం 3,19,879 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు స్పష్టం చేశారు. 54 వేల మంది డిశ్చార్జి కాగా.. 3,563 మంది బాధితుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
రెండు నెలల క్రితం ఇరాన్లో తొలి కరోనా మరణం సంభవించినప్పటి నుంచి అధికారిక గణాంకాలపై పలు ప్రశ్నలు తలెత్తుతూనే ఉన్నాయి. ప్రభుత్వ లెక్కలతో పోలిస్తే వాస్తవ గణాంకాలు అధికంగా ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ దేశ పార్లమెంటరీ నివేదిక విస్తుపోయే విషయాలను వెల్లడించింది. మృతుల సంఖ్య 80 శాతం అధికంగా ఉండే అవకాశం ఉందని అభిప్రాయపడింది. ఇన్ఫెక్షన్ల సంఖ్య సైతం 8 నుంచి 10 రెట్లు ఎక్కువగా ఉంటుందని లెక్కగట్టింది.
సింగపూర్‌లో కొత్త కేసులు
సింగపూర్‌లో కొత్తగా 623 కేసులు నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. మొత్తం బాధితుల సంఖ్య 5,050కి చేరినట్లు వెల్లడించారు. ఇందులో ఎక్కువ మంది విదేశీ కార్మికుల వసతి గృహాల్లో ఉంటున్న వారేనని తెలిపారు. అందులో అత్యధికంగా భారతీయులే ఉన్నట్లు స్పష్టం చేశారు. కేవలం వసతి గృహాలకు సంబంధించిన కేసులే 2,689గా ఉన్నట్లు పేర్కొన్నారు. భారత సంతతి వ్యక్తులకు చెందిన ముస్తఫా సెంటర్ షాపింగ్‌మాల్ నుంచి కేసులు అధికంగా వ్యాప్తి చెందినట్లు అనుమానిస్తున్నారు.
చైనా సవరణ గణాంకాలు
చైనాలో కరోనా బారిన పడి మృతి చెందిన వారి సంఖ్యను అక్కడి ప్రభుత్వం సవరించింది. దేశవ్యాప్తంగా మరణాల సంఖ్యను 40 శాతం పెంచి 4,632గా ప్రకటించింది. కేసుల సంఖ్యను 82,692గా సవరించింది. వుహాన్‌లో మరణాల సంఖ్యను 1,290 మేర పెంచి.. 3,869గా వెల్లడించింది. కేసుల సంఖ్య సైతం 325 పెంచుతూ 50,333కి చేర్చింది.
బంగ్లాలో విజృంభణ
బంగ్లాదేశ్‌లో ఒక్క రోజే 15 మంది మృతి చెందటం వల్ల అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. బంగ్లాదేశ్ మొత్తానికి కొవిడ్-19 వ్యాప్తి ముప్పు ఉన్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు బంగ్లాదేశ్‌లో 75 మరణించారు. గత 24 గంటల్లో 2,190 మందికి పరీక్షలు నిర్వహించగా.. 266 మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది.
ఆఫ్రికాలో 120 కోట్లమందికి కరోనా!
ఆఫ్రికాలో కరోనా కారణంగా కనీసం 3 లక్షల మంది మరణించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మెరుగైన పరిస్థితుల్లో సైతం అక్కడ 3 లక్షల మంది బలయ్యే అవకాశం ఉందని ఇంపీరియల్ కాలేజీ ఆఫ్ లండన్ అంచనా వేసింది. అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఈ సంఖ్య 33 లక్షలకు పైనే ఉంటుందని లెక్కగట్టింది. కేసుల సంఖ్య 120 కోట్లను మించే అవకాశం ఉన్నట్లు కళాశాల నివేదిక పేర్కొంది. భౌతిక దూరం సహా వైరస్ కట్టడికి అత్యుత్తమ విధానాలను ఎంత తీవ్రంగా పాటించినా.. ఇన్ఫెక్షన్ల సంఖ్య 12.2 కోట్లకు చేరుతుందని తెలిపింది.
ఇప్పటివరకు ఆఫ్రికాలో 18 వేల కేసులు నమోదయ్యాయి. అయితే ఐరోపా సహా ఇతర దేశాలతో పోలిస్తే ఆలస్యంగా వైరస్ వెలుగులోకి వచ్చిందని.. మహమ్మారి వ్యాప్తి రేటు మాత్రం అధికంగానే ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.