ఇజ్రాయిల్, గాజా సరిహద్దుల్లో శుక్రవారం జరిగిన నిరసన ప్రదర్శనలు హింసాత్మకంగా మారాయి. పాలస్తీనా నిరసనకారులపై ఇజ్రాయిల్ దళాలు బాష్పవాయువు, బులెట్లు ప్రయోగించాయి. ఈ ఘటనలో 83 మంది నిరసనకారులు గాయాలపాలయ్యారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉందని గాజా వైద్యాధికారులు తెలిపారు.
ఇజ్రాయిల్, గాజా మధ్య సరిహద్దు వివాదాన్ని పరిష్కరించడానికి ఈజిప్ట్ మధ్యవర్తిత్వంలో ఒప్పందం కుదిరింది. ఇది జరిగిన అనంతరం సరిహద్దులో నిరసనలు ఇదే తొలిసారి. ఏప్రిల్ 9న ఇజ్రాయిల్లో ఎన్నికలు జరిగే మూడు రోజుల ముందు ఉద్రిక్తతలు తలెత్తాయి.
ఈజిప్టు ఒప్పందం ప్రకారం గాజాపై ఇజ్రాయిల్ ఆంక్షలు సడలించే అవకాశం ఉంటుందని, ఆర్థికంగా సహకరించి నిరసనలు తలెత్తకుండా చూసేందుకు వీలుకల్పిస్తుందని హమాస్ అధికారులు వెల్లడించారు.
శుక్రవారం ఇజ్రాయిల్, గాజా సరిహద్దుకు చేరుకున్న వేలాది మంది పాలస్తీనా నిరసనకారులు ఆందోళన చేపట్టారు. టైర్లకు నిప్పుపెట్టారు. ఇజ్రాయిల్ సైనికులపై రాళ్లు రువ్వారు. కంచెపై బాంబులు విసిరారు. అదుపుచేసేందుకు ఇజ్రాయిల్ దళాలు నిరసనకారులపై బాష్పవాయువు ప్రయోగించాయి. బుల్లెట్లు కురిపించాయి.