జమ్ముకశ్మీర్ వ్యవహారాన్ని అంతర్జాతీయ అంశంగా మార్చేందుకు మరోమారు విఫలయత్నం చేసింది చైనా. ఆర్టికల్ 370 రద్దు తర్వాత నెలకొన్న పరిస్థితులపై చర్చించాలని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ప్రతిపాదించగా.. దానిని వ్యతిరేకించనున్నట్లు ఫ్రాన్స్ ప్రకటించింది. ఈ అంశం.. ఈ రాత్రికి జరిగే సమావేశంలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉండగా.. వ్యతిరేకిస్తామని ఫ్రాన్స్ తేల్చిచెప్పింది.
జమ్ముకశ్మీర్... భారత్-పాకిస్థాన్‌ల ద్వైపాక్షిక అంశమని, ఇతరుల జోక్యానికి తావులేదని పునరుద్ఘాటించింది ఫ్రాన్స్. ఫలితంగా చైనా ప్రయత్నం బెడిసికొట్టడం ఖాయమైంది.
గతంలోనూ ఇంతే...
ప్రతి విషయంలోనూ పాకిస్థాన్‌కు వంత పాడే చైనా... ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్‌ను అడ్డంపెట్టుకుని భారత్‌ను ఇబ్బంది పెట్టేందుకు వరుస ప్రయత్నాలు చేస్తోంది. గతేడాది ఆగస్టులో కశ్మీర్ అంశంపై అంతర్గత సంప్రదింపులు జరపాలని ఐరాస భద్రతా మండలిలో ప్రతిపాదించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కానీ, డ్రాగన్ దేశం ప్రతిపాదనకు మండలిలోని 14 మంది సభ్యుల్లో ఒక్కరు కూడా మద్దతుగా నిలవకపోవడం గమనార్హం.
ఇదీ చూడండి: కశ్మీర్‌పై డ్రాగన్ గురి పెట్టేందుకు కారణం ఇదే!