పాకిస్థాన్ మాజీ ప్రధాని యూసఫ్ రజా గిలానీకి కరోనా సోకినట్లు నిర్ధరణ అయింది. వైద్యులు ఆయన్ను ఐసొలేషన్‌లో ఉంచి, చికిత్స అందిస్తున్నారు. ఓ అవినీతి కేసులో నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో(ఎన్ఏబీ)కు హాజరైన తర్వాత గిలానీకి పాజిటివ్‌గా తేలింది.
ఇంతకుముందు మనీలాండరింగ్ కేసులో ఎన్ఏబీకి హాజరైన పాక్ ప్రతిపక్ష నేత, పాకిస్థాన్ ముస్లిం లీగ్ (నవాజ్) చీఫ్ షెబాజ్ షరీఫ్ కూడా కరోనా బారిన పడ్డారు. తాజాగా గిలానీకి ఇదే విధంగా వైరస్ సోకటంపై ఆయన కుమారుడు కాసీం గిలానీ ట్విట్టర్ ద్వారా ప్రభుత్వంపై విమర్శలకు దిగారు.
"ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి, ఎన్ఏబీకి కృతజ్ఞతలు. మీరు విజయవంతంగా నా తండ్రి జీవితాన్ని ప్రమాదంలోకి నెట్టారు. ఆయన కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది."
- కాసీం గిలానీ
పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీకి కూడా కరోనా సోకినట్లు శనివారం నిర్ధరించారు అధికారులు.
పాకిస్థాన్‌లో గడిచిన 24 గంటల్లో 6,472 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తంగా కేసుల సంఖ్య 1,32,405కి చేరింది. వైరస్‌తో ఒక్క రోజులో 88 మంది మరణించగా మొత్తం మృతుల సంఖ్య 2,551కి చేరింది.