చైనాలో వరదలు పోటెత్తాయి. ఈనెల 17నుంచి ఏకధాటిగా కురుస్తున్న కుండపోత వర్షాలు... డెంగ్‌ఫెంగ్ నగరాన్ని ముంచెత్తాయి. భీకరమైన వరదల కారణంగా వివిధ ఘటనల్లో 12 మంది మరణించారు. దాదాపు లక్షన్నర మందిపై వరదల ప్రభావం పడింది. 10వేల మందికిపైగా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
వందేళ్లలో ఎప్పుడు లేనంత వర్షం కురిసినట్లు చైనా వాతావరణ విభాగం ప్రకటించింది. ఈ వరదల వల్ల వందల కోట్ల ఆర్థికనష్టం వాటిల్లినట్లు అధికారవర్గాలు తెలిపాయి.
హెనాన్ ప్రావిన్స్‌లో జలదిగ్బంధంలో చిక్కుకున్న వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఫ్యాక్టరీలు, లోతట్టు ప్రాంతాల్లో సహాయ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. వరద ప్రవాహంతో డెంగ్‌ఫెంగ్ నగరం ఏరును తలపిస్తోంది. ఎటు చూసిన వరద ప్రవాహమే కనిపిస్తోంది.
వ్యాపార సముదాయల వద్ద పార్క్ చేసిన వందలాది వాహనాలు వరదలో మునిగి పైభాగం మాత్రమే కనిపిస్తున్నాయి. బాధితులను లైఫ్‌బోట్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరదలో ఆగిపోయిన స్కూలు బస్సులు, ఇతర వాహనాలను ట్రాఫిక్ పోలీసులు తోశారు. చాలా ప్రాంతాల్లో నివాసాలు, వ్యాపార సంస్థల ముందు పార్క్ చేసిన కార్లు కాగితపు పడవల్లా వరదలో కొట్టుకుపోయాయి.
డెంగ్‌ఫెంగ్ నగర శివారులోని ఓ ఫ్యాక్టరీలో చిక్కుకుపోయిన కార్మికులను సహాయ సిబ్బంది. సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కార్మికులంతా మానవహారంగా మారి జల దిగ్బంధం నుంచి బయటపడ్డారు.
ఇదీ చదవండి: Corona: బ్రిటన్ గబ్బిలాల్లో కరోనా వైరస్!