చైనాలో కరోనా (China Covid Latest News) వ్యాప్తి మళ్లీ కలవరం సృష్టిస్తోంది. పర్యటకుల కారణంగా ఆ దేశంలో వైరస్ బాధితులుగా మారే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో (China Covid Latest News) ఆంక్షలను కఠినతరం చేస్తున్నారు అక్కడి అధికారులు. వైరస్ ప్రభావిత ప్రాంతాల్లోని వందలాది విమానాల రాకపోకలపై(China Flight News) నిషేధం విధించారు. పాఠశాలలను మూసివేశారు. పెద్దఎత్తున పరీక్షలు చేపడతున్నారు.
చైనా తమ సరిహద్దులను మూసివేసి, ఎక్కడికక్కడ లాక్డౌన్లు విధించి కొవిడ్ కేసులను సున్నా స్థాయికి పరిమితం చేసింది. వివిధ దేశాలు కరోనా నిబంధనలు సడలిస్తున్నప్పటికీ.. చైనా మాత్రం ఈ ఆంక్షలను కొనసాగించింది. అయితే.. చైనాలో దేశీయంగా కొవిడ్ వ్యాప్తి చాలా తక్కువగానే ఉన్నప్పటికీ.. వరుసగా ఐదోరోజు ఆ దేశంలో కొత్త కేసులు నమోదయ్యాయి. తూర్పు, వాయవ్య చైనాలో కరోనా కేసులు వెలుగు చూశాయి.
వారి వల్లేనా?
చైనాలో కొవిడ్ కేసులు మళ్లీ పెరగడానికి పర్యటకులైన ఓ వృద్ధ దంపతులే కారణమని అక్కడి అధికారులు అనుమానిస్తున్నారు. షాంఘై నుంచి బయలుదేరిన ఆ దంపతులు.. గన్సు ప్రావిన్సు, ఇన్నర్ మంగోలియా, జియాన్ నగరాల్లో పర్యటించారని భావిస్తున్నారు. వారితో సన్నిహితంగా ఉన్న కారణంగా చైనా రాజధాని బీజింగ్ సహా ఐదు ప్రావిన్సులు, ఇతర ప్రాంతాల్లో వైరస్ కేసులు (China Covid Latest News) వెలుగు చూశాయి. దీంతో స్థానిక ప్రభుత్వాలు.. వైరస్ కట్టడికి నడుం బిగించాయి. పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహిస్తున్నాయి. జనం ఎక్కువగా గుమికూడే పర్యటక ప్రాంతాలు, పాఠశాలలు, వినోద వేదికలు వంటి వాటిని అధికారులు మూసివేస్తున్నారు. అంతేగాకుండా ఆయా ప్రాంతాల్లో లాక్డౌన్ వంటి ఆంక్షలను విధిస్తున్నారు.
నెగెటివ్‌గా తేలితేనే బయటకు..
లాంజోవ్ నగరంలో ప్రజలను అనవసరంగా బయటకు వెళ్లకూడదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా బయటకు వెళ్లేవారు కచ్చితంగా కరోనా నెగెటివ్‌గా తేలిన ధ్రువపత్రాలను సమర్పించాలని చెప్పారు. వైరస్ ప్రభావిత ప్రాంతాల్లోని విమానాశ్రయాలను అధికారులు మూసివేశారు. జియాన్, లాంజోవ్ నగరానికి చెందిన 60 శాతం విమానాలు రద్దయ్యాయి.
కాగా.. చైనా వ్యాప్తంగా గురువారం 13 కరోనా కొత్త కేసులు వెలుగుచూశాయి. ఈ మేరకు చైనా నేషనల్ హెల్త్ కమిషన్ తెలిపింది.
ఇవీ చూడండి: