పాకిస్థాన్ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఇమ్రాన్ ఖాన్ అమెరికా పర్యటనకు వెళ్లారు. మూడు రోజుల పర్యటన ముగించుకుని ఇస్లామాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఇమ్రాన్‌ఖాన్‌కు ఘన స్వాగతం లభించింది. అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని ఇమ్రాన్‌కు స్వాగతం పలికారు. తనకు లభించిన స్వాగతాన్ని చూసి ఇమ్రాన్ ఆనందం వ్యక్తం చేశారు.
"అమెరికాకు నా ప్రయాణం, పర్యటన సాఫీగా జరిగింది. మీ స్వాగతం చూస్తుంటే.. దేశానికి మరో ప్రపంచ కప్ గెలుచుకొచ్చిన భావన కలిగింది. ఇంతకు ముందు పాకిస్థాన్‌ను లూఠీ చేసిన వారి భరతం పడతాను. అన్ని వ్యవస్థల్లో పారదర్శకత తీసుకొస్తాను. ఇప్పటివరకు మన దేశాన్ని దొంగలు పడి దోచుకున్నారు. వాళ్లంతా ఇప్పుడు తగిన శిక్ష అనుభవిస్తారు."
- ఇమ్రాన్ ఖాన్, పాక్ ప్రధాని
అడుగడున అవమానాలే..
ఎన్నో అంచనాలతో అమెరికాకు వెళ్లిన ఇమ్రాన్‌కు అడుగడుగునా అవమానాలే ఎదురయ్యాయి. అగ్రరాజ్యంలో ఆయనకు స్వాగతం పలికేందుకు ఎవరూ రాలేదు. కొందరు పాకిస్థానీ అమెరికన్లు, పాక్ విదేశాంగ మంత్రి ఖురేషీలే ఆయనకు స్వాగతం పలికారు. అయితే అమెరికా పర్యటన తనకెంతో ఆనందాన్ని కలిగించిందని ఇమ్రాన్ ఖాన్ చెప్పుకొచ్చారు.
విపక్షాల విమర్శలు
అమెరికా పర్యటనలో భాగంగా.. పాక్ గత ప్రభుత్వాలు అవినీతికి పాల్పడ్డాయని ఇమ్రాన్ చేసిన వ్యాఖ్యలను విపక్షాలు తప్పుబట్టాయి. పరదేశంలో సొంత రాజ్యానికి సంబంధించి ఇటువంటి వ్యాఖ్యలు చేయటం బాధాకరమని విమర్శించారు.
ఇదీ చూడండి: 'ద్వైపాక్షిక చర్చలతో కశ్మీర్‌కు పరిష్కారం రాదు'