అఫ్గానిస్థాన్‌ను ఆక్రమించుకున్న తాలిబన్లు(Taliban) తమ అరాచకాలను కొనసాగిస్తున్నారు. తమకు వ్యతిరేకంగా ఉన్నవారిని, ఒకప్పుడు వారికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసినవారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా ప్రముఖ జానపద గాయకుడు ఫవాద్ అందరాబీని పొట్టనపెట్టుకున్నారు. అతడి పేరుపై ఉన్న అందరాబీ పర్వత ప్రాంతంలోనే శుక్రవారం ఫవాద్‌ను హత్య చేసినట్లు గాయకుడి కుటుంబీకులు వెల్లడించారు. తిరుగుబాటుదారులే ఈ హత్య చేసి ఉంటారని తాలిబన్లు పేర్కొనడం గమనార్హం.
తండ్రి మృతిపట్ల ఫవాద్ కుమారుడు జవాద్ అందరాబీ ఆవేదన వ్యక్తం చేశాడు. 'కొద్దిరోజుల క్రితమే కొందరు తాలిబన్లు మా ఇంటికి వచ్చి నాన్నతో కలిసి టీ తాగారు. కానీ ఏమైందో ఏమో ఇంతలోనే మా నాన్నను పొట్టన పెట్టుకున్నారు' అంటూ జవాద్ వాపోయాడు. తన తండ్రి హత్యపై న్యాయం కోరుతూ స్థానిక తాలిబాన్ కౌన్సిల్‌ను ఆశ్రయింగా.. ఫవాద్ మృతికి కారణమైనవారిని గుర్తించి శిక్షిస్తామని వారు పేర్కొన్నట్లు జవాద్ తెలిపాడు. ఈ ఘటనపై దర్యాప్తు నిర్వహించి ఇందుకు కారకులైన తిరుగుబాటుదారులను శిక్షిస్తామని తాలిబన్ల ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ వెల్లడించారు.
అందరాబీ పర్వత ప్రాంతం బగ్లాన్ ప్రావిన్స్‌కు 100 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. అఫ్గాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్నప్పటి నుంచి బగ్లాన్ ప్రావిన్స్‌లో యుద్ధ వాతావరణం నెలకొంది. తాలిబన్లపై స్థానిక సాయుధ ప్రజలు వారం రోజుల క్రితం తిరుగుబాటు జెండా ఎగరేశారు. మూడు జిల్లాలను స్వాధీనం చేసుకున్నారు. ఉలిక్కిపడ్డ ముష్కర ముఠా 24 గంటల వ్యవధిలోనే ఆ జిల్లాలను తిరిగి ఆక్రమించుకున్నాయి. ఇరు వర్గాల మధ్య తలెత్తిన ఘర్షణల్లో 50 మందికి పైగా తాలిబన్ ఫైటర్లు హతమయ్యారు.
ఇదీ చూడండి: ISIS khorasan: 'ఐసిస్-కే'కు రూ.వేల కోట్ల నిధులు ఎలా వచ్చాయ్?