పాకిస్థాన్లో భారీ పేలుడు సంభవించింది. పంజాబ్ రాష్ట్రంలోని బహవాల్నగర్ నగరంలో షియా ముస్లింలు నిర్వహిస్తున్న ఓ ఊరేగింపులో బాంబు పేలింది. రోడ్డు పక్కన జరిగిన ఈ శక్తిమంతమైన పేలుడు ధాటికి ముగ్గురు మరణించారు. 59 మంది గాయపడ్డారు.
దీనిపై సీనియర్ పోలీసు అధికారి ఒకరు స్పందించారు. గుర్తు తెలియని వ్యక్తి గ్రెనేడ్ విసిరాడని తెలిపారు. దీనివల్లే పేలుడు జరిగిందని చెప్పారు. అనుమానితుడిని అరెస్టు చేసినట్లు స్పష్టం చేశారు.
ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అంబులెన్సులు, పోలీసుల వాహనాలు పేలుడు ప్రాంతానికి వెళ్లడం వీడియోల్లో కనిపిస్తోంది. గాయపడ్డ కొందరు రోడ్లపై సాయం కోసం అర్థించడం కలచివేస్తోంది.
షియా నేత ఖవార్ షఫ్కాత్ ఈ పేలుడును ధ్రువీకరించారు. ఘటనను ఖండించిన ఆయన... ప్రభుత్వం ఇలాంటి ఊరేగింపుల వద్ద అదనపు భద్రతా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అషౌరా పండగ నేపథ్యంలో బుధవారమే దేశవ్యాప్తంగా మొబైల్ ఫోన్ సేవలను నిలిపివేశారు. దీంతో సమాచార మార్పిడి కష్టమవుతోంది.