ప్రపంచవ్యాప్తంగా 162 దేశాలకు విస్తరించిన కరోనా మహమ్మారి ఐరోపాతో పాటు ఇరాన్‌లో తీవ్ర ప్రభావం చూపుతోంది. వైరస్ వెలుగు చూసినప్పటి నుంచి చైనాలో ఇప్పటివరకూ 3,200 మందికిపైగా మృతి చెందగా గత కొద్ది రోజుల్లోనే ఇటలీలో 2,500మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. సోమవారం 349 మంది, మంగళవారం 345 మంది మృత్యువాత పడ్డారు. ఇటలీలో కొత్త కేసులు సైతం మంగళవారం 3,500కుపైగా నమోదయ్యాయి. మొత్తం కేసులు 31,500 దాటాయి.
స్పెయిన్‌లో...
స్పెయిన్‌లోనూ కరోనా విజృంభిస్తోంది. మంగళవారం ఒక్కరోజే 191 మంది ప్రాణాలు కోల్పోగా 1,806 మందికి కొత్తగా వైరస్ సోకింది. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 11,748కి చేరింది. ఇరాన్‌లో మంగళవారం 135 మంది మృతిచెందగా 1,178 మందిలో కొత్తగా వైరస్ నిర్ధరణ అయింది. మొత్తం కేసుల సంఖ్య 16,169కి చేరింది.
ఫ్రాన్స్‌లోనూ..
ఫ్రాన్స్‌లోనూ మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మంగళవారం 27 మంది మరణించగా 1,097 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం 175 మంది మృత్యువాత పడినట్లు ఆ దేశ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో కరోనా సంక్షోభం యుద్ధ వాతావరణం తలపిస్తోందని ఆ దేశ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్ వ్యాఖ్యానించారు. దేశంలో ఉన్న ఆంక్షలను మరింత కఠినతరం చేస్తున్నట్లు ప్రకటించారు. మహమ్మారి ప్రభావంతో పలు పెద్ద కంపనీలు దివాలా పరిస్థితికి వచ్చాయి. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు అవసరమైతే వాటిని జాతీయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
బ్రిటన్‌లో 16 మంది చనిపోగా , కొత్తగా 407 మందిలో వైరస్ ఉన్నట్లు తేలింది. ఈ వారం ఐరోపా సమాఖ్యతో జరగాల్సిన బ్రెగ్జిట్ చర్చలను కూడా వాయిదా వేసింది బ్రిటన్. నెదర్లాండ్స్‌లో 19 మంది మృతిచెందగా.. కొత్తగా 292 కేసులు బయటపడ్డాయి.
అమెరికాలోనూ మంగళవారం 14 మంది మృతిచెందితే.. 1,258 మందికి వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. దేశ వ్యాప్తంగా మరణాల సంఖ్య 100కు చేరింది. మొత్తం కేసులు 5,900 దాటాయి. బ్రెజిల్లో తొలి మరణం సంభవించినట్లు ఆ దేశ అధికారులు ప్రకటించారు. పాకిస్థాన్‌లోనూ 212 మంది వైరస్ బారిన పడ్డారు. జర్మనీ, దక్షిణ కొరియాలోనూ మరణాలు, కొత్త కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి. .
రష్యాలోనూ..
ప్రపంచాన్ని వణికిసోన్న కరోనా వైరస్ రష్యాలో అదుపులోనే ఉన్నట్లు ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. దేశ వ్యాప్తంగా 114 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. ప్రతి రోజు లక్ష మంది వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)ను కూడా కరోనా వదలటం లేదు. ఈ సంస్థ ప్రధాన కార్యాలయంలో పనిచేసే ఇద్దరు వ్యక్తులకు వైరస్ సోకినట్లు అధికారులు స్పష్టం చేశారు.
కరోనా ముప్పు నేపథ్యంలో విధించిన కఠిన ఆంక్షలు బ్రెజిల్‌లోని పలు కారాగారాల్లో అల్లర్లకు దారితీశాయి. ఫలితంగా దాదాపు 1500 మంది ఖైదీలు జైళ్ల నుంచి పారిపోయారు.
ప్రయాణాలపై జర్మనీ ఆంక్షలు..
కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు పలు దేశాలు పటిష్ఠ చర్యలు చేపడుతూనే ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలతో ఐరోపా దేశాలు మరిన్ని కఠిన చర్యలు తీసుకున్నాయి. దుకాణాలు, రెస్టారెంట్లు తెరకపోవడం వల్ల లక్షలాది ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.
ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్ సహా అన్ని దేశాలు దాదాపుగా లాక్‌డౌన్ ప్రకటించాయి. సరిహద్దులు ఇప్పటికే మూతపడగా ప్రయాణాలను పూర్తిగా మానుకోవాలని ప్రజలను కోరేందుకు ఆయా దేశాలు సిద్ధమయ్యాయి. ఈయూ వెలుపల నుంచి వచ్చే ప్రయాణికులకు 30 రోజుల పాటు ప్రయాణ ఆంక్షలు విధిస్తున్నట్లు జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ వెల్లడించారు.
ఇదీ చూడండి: కర్ఫ్యూ, బంద్‌తో కరోనాపై ప్రపంచ దేశాల యుద్ధం