'మ్యాన్ వర్సెస్ వైల్డ్' కార్యక్రమంలో బేర్ గ్రిల్స్‌తో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ చేసిన సాహసాలు సరికొత్త రికార్డును సృష్టించాయని తెలిపింది డిస్కవరీ ఛానల్. ఈ నెల 12న డిస్కవరీలో ప్రసారమైన ఈ షోకు భారత్‌లో రికార్డుస్థాయిలో.. 36 లక్షల 90వేల ఇంప్రెషన్స్ వచ్చినట్లు తెలిపింది. డీడీ నేషనల్‌తో కలిపి మొత్తంగా (తొలిసారి, మలిసారి ప్రసారాలు) 427 లక్షల (42.7 మిలియన్) ఇంప్రెషన్స్ వచ్చినట్లు ప్రకటించింది. బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బీఏఆర్సీ) డేటా ప్రకారమే ఈ ప్రకటన చేస్తున్నట్లు స్పష్టం చేసింది.
ఈ ప్రత్యేక కార్యక్రమంతో డిస్కవరీ ఛానల్ ఏకంగా 36 లక్షల 90 వేల ఇంప్రెషన్స్ సాధించి.. దేశవ్యాప్తంగా మూడోస్థానంలో నిలిచింది. స్టార్ ప్లస్ (36 లక్షల 70 వేల ఇంప్రెషన్స్)ను వెనక్కినెట్టి.. ఈ ఘనతను సొంతం చేసుకొంది. ఈ కార్యక్రమాన్ని సగటున 29.2 నిమిషాలపాటు ప్రేక్షకులు వీక్షించారు. ప్రపంచవ్యాప్తంగా 360 కోట్ల సోషల్ ఇంప్రెషన్స్‌తో మోస్ట్ ట్రెండింగ్ టెలివిజన్ ఈవెంట్‌గా నిలిచిందని డిస్కవరీ సంస్థ ప్రకటించింది.
పులుల సంరక్షణకు సాయం..
ఈ కార్యక్రమం రికార్డు స్థాయిలో విజయం సాధించినందుకు భారత్‌లో పులుల సంరక్షణకు ఆర్థిక సాయం చేసేందుకు నిర్ణయించుకుంది డిస్కవరీ. అలాగే అంతర్జాతీయ ప్రాజెక్టు.. కన్జర్వేటివ్ ఎకర్స్ ఫర్ టైగర్స్ (సీఏటీ)లో భాగంగా నాలుగు దేశాల్లో భవిష్యత్ తరాల పులుల కోసం 60 లక్షల ఎకరాల భూమిని సంరక్షిస్తామని స్పష్టం చేసింది.
ఉత్తరాఖండ్‌లోని జిమ్ కార్పెట్ జాతీయ పార్కులో బేర్ గ్రిల్స్‌తో కలిసి మోదీ చేసిన సాహసయాత్ర ఆగస్టు 12న రాత్రి 9 నుంచి 10 గంటల మధ్యలో ప్రసారమైంది.