నేపాల్లో మూడు రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వరద కారణంగా పదుల సంఖ్యలో పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. వేర్వేరు చోట్ల జరిగిన ఘటనల్లో ఇప్పటివరకు మొత్తం 104 మంది చనిపోగా.. 41 మంది గల్లంతయ్యారు. వీటిలో చాలా వరకు మరణాలు కొండచరియలు విరిగిపడటం వల్ల సంభవించినట్లు ఆ దేశ హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
'దేశంలోని వివిధ ప్రావిన్సుల్లో సంభవించిన వరదల వల్ల బుధవారం ఒక్కరోజే 63 మంది మరణించారని.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని' హోం మంత్రిత్వ శాఖ విపత్తు నిర్వహణ విభాగం అధికారి హమ్కల పాండే తెలిపారు. మరోవైపు.. ఈ విపత్తులో కనిపించకుండాపోయిన వారి సంఖ్య 41కి చేరింది. వారి కోసం అధికారులు అన్వేషిస్తున్నారు.
ఇక.. వరదల కారణంగా 2,232 ఇళ్లు మునిగిపోగా.. 1,177 గృహాలు కొట్టుకుపోయాయి. మరో నలభై తొమ్మిది ఇళ్లు, 8 గోశాలలు, 6 వంతెనలు, 3 ప్రభుత్వ కార్యాలయాలు దెబ్బతిన్నాయి.
వరదలు ముప్పు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది సైన్యం.
ఇవీ చదవండి: