నవ్వులు తెప్పించే వాయువుగా పేరొందిన లాఫింగ్ గ్యాస్.. ఉక్రెయిన్‌కు చెందిన చెస్ గ్రాండ్ మాస్టర్, ఆయన స్నేహితురాలును బలిగొంది. మాస్కోలోని ఒక ఫ్లాట్‌లో వీరు విగతజీవులై కనిపించారు. లాఫింగ్ గ్యాస్ వల్లే వీరు ప్రాణాలు కోల్పోయి ఉంటారని అధికారులు చెప్పారు.
ఉక్రెయిన్‌పై తలపడి..
స్టానిస్‌లావ్ బోగ్డానోవిచ్ (27), అలెజ్గాండ్రా వెర్నిగోరా (18) మాస్కోలో ఉంటున్నారు. బోగ్డానోవిచ్ ఒక స్పీడ్ చెస్ ఛాంపియన్. ఇటీవల ఒక ఇంటర్నెట్ చెస్ పోటీలో రష్యా తరఫున బరిలోకి దిగారు. ఉక్రెయిన్‌పై తలపడి, గెలుపొందారు. రష్యాకు, ఉక్రెయిన్‌కు మధ్య తీవ్ర విభేదాలున్న నేపథ్యంలో ఆయన చర్య స్వదేశంలో తీవ్ర విమర్శలకు దారితీసింది. రష్యా- ఉక్రెయిన్ ఘర్షణకు ముగింపు పలకటానికే రష్యా తరఫున ఆడినట్లు చెప్పుకున్నారు.
వెర్నిగోరా కూడా చెస్ క్రీడాకారిణే. వీరి ఫ్లాట్‌లో లాఫింగ్ గ్యాస్ బెలూన్లు ఉన్నాయి. బెలూన్ సాయంతో ఈ గ్యాస్‌ను పీలుస్తుంటారు. ఈ మరణాలకు సంబంధించి అనుమానించదగ్గ అంశాలేవీ కనిపించడం లేదని రష్యా దర్యాప్తు అధికారులు తెలిపారు.
ఏమిటీ లాఫింగ్ గ్యాస్?
లాఫింగ్ గ్యాస్‌గా పేరు పొందిన నైట్రస్ ఆక్సైడ్‌ను శస్త్రచికిత్సల్లో మత్తుమందుగా ఉపయోగిస్తున్నారు. నొప్పి నుంచి ఉపశమనానికీ వాడుతున్నారు. దీనిని పీల్చినప్పుడు ఊపిరితిత్తుల ద్వారా రక్తంలో కలుస్తుంది. తర్వాత వేగంగా మెదడును చేరుతుంది. శరీర సహజసిద్ధమైన మత్తు పదార్థాలైన ఎండార్ఫిన్లు, డోపామైన్‌ను విడుదల చేసేలా ప్రేరేపిస్తుంది. ఫలితంగా సంతోషకరమైన భావనలు కలిగి నవ్వాలనిపిస్తుంది. అందుకే దీనికి లాఫింగ్ గ్యాస్ అని పేరు వచ్చింది. మత్తు, వినోదం కోసం సొంతంగా పీలుస్తున్నప్పుడు వికటించి మరణాలు సంభవిస్తున్నాయి.
ఇదీ చూడండి: 'కరోనాపై నిర్లక్ష్యం తగదు.. వెనుకడుగు వేయొద్దు'