సిగరెట్, మందు, గుట్కా... వీటికి ప్రపంచంలో ఎంతో మంది బానిసలుగా మారుతున్నారు. ముఖ్యంగా మాదకద్రవ్యాలకు బానిసలవుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది.
యుక్త వయసులో సరదాలకు అలవాటు చేసుకుని ఇప్పుడు దూరంగా ఉండాలనుకున్నా... కుదరని పరిస్థితి. ఫలితంగా చాలా మంది తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు. ఎన్నో చికిత్సలు పొందినా ఫలితం లేకుండాపోతోందని బాధపడతున్నారు.
చైనాలోని రుయిజిన్ ఆసుపత్రి వైద్యులు మాత్రం తాము అందించే శస్త్రచికిత్స కచ్చితమైన ఫలితాన్ని అందిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆ చికిత్స పేరే డీబీఎస్.
డీబీఎస్ ప్రక్రియ...
డీబీఎస్ అంటే 'డీప్ బ్రెయిన్ స్టిములేషన్'. చికిత్స ఖరీదు 25 వేల డాలర్లు. ఐదు నెలల క్రితం ఓ రోగికి ఈ చికిత్సను అందించారు. మత్తు పదార్థాలకు ఇప్పటికీ దూరంగా ఉంటున్నానని రోగి స్పష్టం చేశారు.
తొలుత రోగి మెదడుకు సంబంధించిన పరీక్షలు నిర్వహించి కొన్ని కణాలను గుర్తిస్తారు. అనంతరం శస్త్రచికిత్సతో మెదడులోకి కొన్ని చిన్న పరికరాలను పంపుతారు. ఆ పరికరాలు మెదడులోని కణాలను నియంత్రించేందుకు ఉపయోగపడతాయి.
ప్రస్తుత పరిస్థితుల్లో డీబీఎస్ ఎంతో అవసరమని వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలోని అనస్థీషియాలజీ అండ్ సైకాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ మేగన్ క్రీడ్ చెప్పారు.
"నరాలు, మానసిక సమస్యతో సతమతం అవుతున్న వారికి అందించే చికిత్సే డీప్ బ్రెయిన్ స్టిములేషన్(డీబీఎస్). ప్రస్తుత పరిస్థితులు, మాదకద్రవ్యాలకు బానిసగా మారుతున్న వారి సంఖ్యను పరిశీలిస్తే... డీబీఎస్తో చికిత్స అందించడానికి ఇదే సరైన సమయం. డీబీఎస్ ఎంతో అవసరం."
--- మేగన్ క్రీడ్, అసిస్టెంట్ ప్రొఫెసర్
ప్రస్తుతం ఈ చికిత్స పరిశోధనాత్మక దశలోనే ఉంది. చైనాలో యాంటీ డ్రగ్ చట్టాలు ఎంతో కఠినంగా ఉంటాయి. అందువల్ల ఈ చికిత్సపై అధిక సంఖ్యలో రోగులు ఆసక్తి చూపే అవకాశం ఉంది.
కానీ కొంత మంది శాస్త్రవేత్తలు డీబీఎస్ను వ్యతిరేకిస్తున్నారు. శస్త్రచికిత్స ప్రక్రియలో లోపాలున్నాయని... అవి రోగులకు ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు.
ఇదీ చూడండి: జూన్లో వడ్డీ రేట్ల కోత? ఆ తర్వాత కష్టమే!