శత్రు దేశాల నుంచి క్షిపణి ముప్పును ఎదుర్కొనే యాంటీ బాలిస్టిక్ మిసైల్ సామర్థ్యాన్ని చైనా గురువారం పరీక్షించింది. ఈ ప్రయోగం విజయవంతమైనట్టు ఆ దేశ రక్షణ శాఖ వెల్లడించింది. అమెరికా తర్వాత ఇంతటి సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసిన రెండో దేశంగా నిలిచింది చైనా.
రష్యాతో కీలక అణ్వాయుధ నియంత్రణ ఒప్పందాన్ని పొడిగించేందుకు బైడెన్ సర్కార్ ఆమోదం తెలిపిన మరుసటి రోజే చైనా ఈ ప్రయోగం చేపట్టటం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే.. ఈ పరీక్ష ఏ దేశాన్నీ లక్ష్యంగా చేసుకోలేదని చైనా రక్షణ శాఖ స్పష్టం చేసింది.
మరోవైపు.. ఈ పరీక్ష అమెరికా నూతన అధ్యక్షుడు బైడెన్‌కు ఓ సందేశం అని మకావు సైనిక వ్యవహారాల వ్యాఖ్యాత ఆంటోని వాంగ్ టోంగ్ అన్నారు. ఇంటర్మీడియట్-రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్ ట్రిటీ(ఐఎన్ఎఫ్) నిష్క్రమణ అనంతరం.. అమెరికా ఈ తరహా బాలిస్టిక్ క్షిపణులను మరింత వేగంగా అభివృద్ధి చేస్తోందని ఆయన చెప్పారు.
ఇటీవలి కాలంలో చైనాను వ్యూహాత్మక పోటీదారుగా పరిగణించింది అగ్రరాజ్యం. అణు సామర్థ్యాలను పారదర్శకత లేకుండా వేగంగా అభివృద్ధి చేసిందని చైనాపై మండిపడింది.
ఇదీ చదవండి: ట్రంప్‌కు ఆ విషయాలు చెప్పబోం: బైడెన్