Cyberattack in Ukraine: ఉక్రెయిన్‌లో శుక్రవారం భారీ సైబర్ దాడి జరిగింది. దీంతో ప్రభుత్వానికి చెందిన అనేక కీలక వెబ్‌సైట్‌లు పనిచేయకుండా పోయాయి. ఉక్రెయిన్ విషయంలో రష్యా.. అమెరికా, నాటో కూటమి దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో ఈ దాడి చోటుచేసుకుంది. ఈ సైబర్ ఎటాక్ కారణంగా ఇక్కడి విదేశాంగ, విద్యా, కేబినెట్ తదితర శాఖల వెబ్‌సైట్‌లు మూతపడ్డాయని అధికారులు ఓ వార్తాసంస్థకు చెప్పారు. రాత్రికి రాత్రే జరిగిన ఈ దాడి కారణంగా సైట్లు డౌన్ అయ్యాయని పేర్కొన్నారు. సంబంధిత నిపుణులు ఐటీ వ్యవస్థలను పునరుద్ధరించే పనిలో ఉన్నారు. సైబర్ పోలీసులు ఈ వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభించారని వెల్లడించారు. మరోవైపు ఈ దాడికి ఇంతవరకు ఎవరూ బాధ్యత తీసుకోలేదు.
అంతకుముందు హ్యాకర్లు.. విదేశాంగశాఖ వెబ్‌సైట్‌లో ఓ సందేశాన్ని డిస్‌ప్లే చేశారు. 'ఉక్రెనియన్లు! మీ వ్యక్తిగత సమాచారం మొత్తం తొలగించాం. దాన్ని తిరిగి పొందడం అసాధ్యం. మీ డేటా మొత్తం బహిర్గతమైంది. మున్ముందు పరిస్థితులు మరింత దిగజారుతాయి' అని అందులో హెచ్చరించారు. గతంలోనూ ఇక్కడి ప్రభుత్వ వెబ్‌సైట్‌లపై సైబర్ దాడులు జరగ్గా.. ఇది రష్యాకు చెందినవారే చేశారంటూ ఉక్రెయిన్ ఆరోపణలు చేసింది. ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్‌పై దాడి చేసే ఉద్దేశం లేదంటూనే రష్యా.. ఆ దేశ సరిహద్దుల్లో లక్షమంది సైనికులు, ఆయుధాలను మోహరించిన విషయం తెలిసిందే. వాటిని వెనక్కి రప్పించాలంటూ అమెరికా, నాటో కూటమి డిమాండ్ చేస్తుండగా.. రష్యా ససేమిరా అంటోంది. ఈ విషయమై ఇటీవల అమెరికా, రష్యాల మధ్య జరిగిన చర్చలూ విఫలమయ్యాయి.
ఇదీ చూడండి: పుతిన్‌కు బైడెన్ స్ట్రాంగ్ వార్నింగ్- అదే జరిగితే..!