కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ సదస్సులో ప్రధాని నరేంద్రమోదీ హిందీలో ప్రసంగించారు. ఎస్సీఓలో శాశ్వత సభ్య దేశంగా చేరి రెండేళ్లు పూర్తయిందని తెలిపారు. ఈ మధ్య కాలంలో ఎస్సీఓ నిర్వహించిన అన్ని కార్యక్రమాల్లో కీలకంగా పని చేశామని పేర్కొన్నారు.
వివిధ రంగాల్లో సంయుక్తంగా తీసుకోవాల్సిన చర్యలపై సభ్యదేశాలకు కీలకమైన సూచనలు చేశారు మోదీ. ఉగ్రవాద నిర్మూలనకు కృషి చేయాలని సభ్య దేశాలకు పిలుపునిచ్చారు.
"ఉగ్రవాద రహిత సమాజం... గత ఆదివారం శ్రీలంక పర్యటనలో భాగంగా సెయింట్ ఆంటోనీ చర్చిని సందర్శించాను. అక్కడ ఎలాగైతే ఉగ్రవాదులు దాడులు చేశారో.. ప్రపంచంలో ఎక్కడో ఆ చోట రోజూ ఇదే మారణకాండ సాగుతోంది. ఈ ప్రమాదం నుంచి బయట పడేందుకు దేశాలన్ని విభేదాలు పక్కన పెట్టి సమష్టి కృషి చేయాలి. ఉగ్రవాదులకు మద్దతు, ప్రోత్సాహం, ధనబలం కల్పించే దేశాలపై చర్యలు తీసుకోవాలి. ఎస్సీఓ దేశాలు కలిసి ఉగ్రవాదంపై పోరాడాలి. తీవ్రవాదాన్ని అణచివేసేందుకు ఒక అంతర్జాతీయ వేదిక ఏర్పాటు చేయాలని భారత్ కోరుతోంది."
- నరేంద్రమోదీ, ప్రధానమంత్రి
ఇదీ చూడండి: ఎస్సీఓ సభ్య దేశాధినేతల సమావేశం