ETV Bharat / international

కొత్త బంగారు లోకం.. ఇక తరగతిలో రెండు గ్రూపులు!

author img

By

Published : May 12, 2020, 7:04 AM IST

Updated : May 12, 2020, 11:26 AM IST

కరోనా వైరస్​ను కట్టడి చేసేందుకు విధించిన లాక్​డౌన్​ను భయం భయంగానే ఎత్తివేస్తున్నాయి దేశాలు. కొన్నాళ్లపాటు కొవిడ్​తో సహజీవనం తప్పదనుకున్న ప్రజలు మెల్లిగా ఎవరి పనిలో వారు కుదురుకుంటున్నారు. ఈ సరికొత్త సాధారణ లోకం ఇప్పుడు కరోనా బారిన పడకుండా సరికొత్త మార్గాల్ని అన్వేషిస్తోంది!

countries reopening after long  corona lockdown with safety measures
కరోనా చీకటిలో జాగ్రత్తల లాంతరుతో కొత్త వెలుగు!

సుదీర్ఘ చీకట్లను తరిమేస్తూ వెలుగురేఖలు ప్రసరిస్తున్నాయి. లాక్‌డౌన్‌ల నుంచి ప్రపంచం మెల్లిమెల్లిగా ద్వారాలు తెరుచుకుంటోంది. భయంగానే అయినా ప్రజలు నెమ్మదిగా తమ రోజువారీ పనుల్లో కుదురుకుంటున్నారు. కొన్ని దేశాల్లో బడి సంచులు భుజానేసుకుని పిల్లలు మళ్లీ పాఠశాలలకు పయనమవుతున్నారు. ఓ వైపు కరోనా మహమ్మారి భయపెడుతున్నా.. ఇరుసు విరిగిన ఆర్థిక బండిని పట్టాలెక్కించే పనిలో ప్రభుత్వాలు నిమగ్నమయ్యాయి. అయితే ఇప్పుడు మొదలవుతున్న సాధారణ జీవితం గతానికి కొంత భిన్నంగా ఉంటోంది. కరోనా వైరస్‌ ప్రపంచ మానవాళికి మాస్క్‌లు కట్టేసింది. కరచాలనాలు, పక్కపక్కన కూర్చోవడాలు బంద్‌. తరచుగా చేతులు కడుక్కోవడం.. భౌతిక దూరాన్ని పాటించడం వంటి అలవాట్లే ప్రస్తుతానికి 'సోషల్‌ వ్యాక్సిన్లు'. కొత్త సాధారణ జీవితాన్ని ఇలాగే కొనసాగించక తప్పదు!!

నష్టమైనా తప్పదు

వ్యాధి వ్యాప్తి, మరణాల తగ్గుదల... ప్రజల్లో భయం తగ్గడం.. మహమ్మారి నిర్మూలన అయిందనడానికి కొలమానాలని చరిత్రకారులు చెబుతారు. ప్రస్తుతం ఇవి ఇంకా సాకారం కాలేదు. ఇప్పటికీ అనేక దేశాల్లో కరోనా విజృంభిస్తోంది. టీకా ఇంకా సిద్ధం కాలేదు. అయితే వ్యాప్తి నియంత్రణలోకి వచ్చిందనుకున్న దేశాలు... నష్టం భరించడానికి సిద్ధమైన దేశాలు... కరోనాతో కంటే ఆకలితో ఎక్కువ మంది చనిపోయే ప్రమాదం ఉందంటున్న దేశాలూ 'కొత్త సాధారణ జీవితాన్ని' ప్రారంభిస్తున్నాయి. 'కరోనాతో కలిసి జీవించాల్సిందే- అప్రమత్తంగా ఉందాం'.. అంటూ ప్రభుత్వాధినేతలూ స్పష్టంచేస్తున్నారు. లాక్‌డౌన్లను జోన్ల వారీగా పరిమితం చేస్తున్నారు. రెడ్‌జోన్లను జిల్లా స్థాయి నుంచి మండలాలు, కాలనీల స్థాయికి తగ్గించి, మిగతా వారికి వారి పనులు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. భారత్‌ వంటి దేశాల్లోనూ వ్యాధిపై అవగాహన పెరగడం, కరోనాకు వైద్య సదుపాయాలను భారీగా పెంచడం కొంత ధైర్యాన్నిస్తున్నాయి.

కార్యాలయాల్లో విడతల వారీ విధులు

ప్రపంచవ్యాప్తంగా కొత్త నిబంధనలతో కార్యాలయాలు తెరుచుకుంటున్నాయి. అందరూ ఒకేసారి 9-10 గంటలకు వచ్చి 5-6 గంటలకు తిరిగి వెళ్లే పరిస్థితి మారి రోజుకు మూడు షిఫ్టుల్లో ఉద్యోగులు వచ్చి వెళ్లేలా కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. అవకాశం ఉన్నచోట ఇంటి నుంచే పనిచేయించడానికి సాఫ్ట్‌వేర్‌ సంస్థలు సిద్ధమై, చేయిస్తున్నాయి కూడా. ఇకపైనా అదే ఒరవడి కొనసాగనుంది.

తెరుచుకుంటున్న పాఠశాలలు

వివిధ దేశాల్లో పాఠశాలల్ని తెరుస్తున్నారు. అయితే భౌతిక దూరం, పరిశుభ్రత, తరగతి గదిలో శానిటైజర్ల ఏర్పాటు, పిల్లలు మాస్కులు ధరించడం లాంటి వాటిని తుచ తప్పకుండా పాటిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థల పునఃప్రారంభం పాఠశాలల ప్రారంభంతో ముడిపడి ఉంది. ఎందుకంటే.. పాఠశాలలు తెరవకుంటే తల్లిదండ్రుల్లో ఒకరు తమ ఉద్యోగానికి వెళ్లడానికి అవకాశం ఉండదు. ఈ పరిస్థితులు జర్మనీ, డెన్మార్క్‌ సహా అనేక దేశాల్లో డేకేర్‌ సెంటర్లు, ప్రాథమిక పాఠశాలల సత్వర పునఃప్రారంభానికి ఒక కారణం. స్వీడన్‌ అసలు పాఠశాలల్ని మూయకపోవడం గమనార్హం. అయితే భౌతిక దూరం, పరిశుభ్రతని కచ్చితంగా అమలుచేసింది.

ప్రతి తరగతిలో రెండు గ్రూపులు

  • ఆస్ట్రియా దేశం ఈ వారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభిస్తోంది. ప్రతి తరగతిలో విద్యార్థులను రెండు గ్రూపులుగా చేయనుంది. 'ఎ' గ్రూపు విద్యార్థులు సోమవారం నుంచి బుధవారం వరకూ, 'బి' గ్రూపు విద్యార్థులు గురు, శుక్రవారాలు తరగతులకు హాజరవుతారు. రెండో వారం 'బి' గ్రూపు విద్యార్థులు మూడు రోజులు, ఎ గ్రూపు విద్యార్థులు రెండు రోజులు హాజరవుతారు. ఇంటిదగ్గర ఉండే వారికి ఆన్‌లైన్‌ బోధన ఉంటుంది. అనేక దేశాలు 40 మంది సామర్థ్యం ఉన్న తరగతి గదిలో 20 మంది విద్యార్థులకే బోధన చేపడుతున్నాయి.
  • జర్మనీలోని ఓ చిన్న పట్టణమైన న్యూస్ట్రిల్జ్‌లోని ఓ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సొంతంగా కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేసుకునే కిట్లు సరఫరా చేస్తున్నారు.
  • మన దేశంలో ఎండా కాలం కావడంతో పాఠశాల విద్యార్థులకు వేసవి సెలవులే. పరీక్షలు పూర్తికావాల్సిన పదో తరగతి, ఇతర విద్యార్థులకు.. భౌతిక దూరం అమలుతో పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆన్‌లైన్‌ పాఠాలను ఇప్పటికే చాలా కళాశాలలు అమలు చేస్తున్నాయి.

రెండు కుటుంబాలకు మించి కలవొద్దు

స్నేహితులు, బంధువులతో సరదాగా గడిపే విషయంలో రెండు కుటుంబాలకు మించి కలవకూడదని జర్మనీ నిబంధన విధించింది. న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా కూడా కొద్ది మార్పులతో ఇలాంటి నిబంధననే తెచ్చాయి.

  • ఫ్రాన్స్‌లో సోమవారం కఠిన లాక్‌డౌన్‌ని సడలించారు. దాదాపుగా రెండు నెలల తర్వాత ఫ్రెంచి ప్రజలు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా తమ ఇళ్ల నుంచి బయటికి వెళ్లగలుగుతున్నారు. ప్యారిస్‌ మెట్రోలో ప్రతి రెండు సీట్లకు ఒక సీటుని ఖాళీగా ఉంచుతున్నారు. ప్రయాణికులు తగినంత దూరంలో నిలుచోవడానికి వీలుగా పెద్ద పెద్ద స్టిక్కర్లు అతికించారు.
  • స్పెయిన్‌లో సగం మంది జనాభాకు సోమవారం నుంచి లాక్‌డౌన్‌ ఆంక్షల్ని చాలా వరకూ తొలగించారు.

షాంఘై డిస్నీలాండ్‌ ప్రారంభం

షాంఘై డిస్నీలాండ్‌ని సోమవారం తెరిచారు. భౌతిక దూరం పాటించడం, మాస్క్‌ ధరించడం తప్పనిసరి చేశారు. చైనా ప్రభుత్వం ఈ పార్క్‌లోకి రోజుకు 24 వేల మంది పరిమితిని విధించింది. సాధారణ రోజుల్లో రోజువారీ సందర్శకుల సంఖ్యలో ఇది మూడోవంతు కంటే తక్కువ. వివిధ దేశాల్లో ఉన్న డిస్నీ రిసార్ట్స్‌లలో ఇదే తొలి పునఃప్రారంభం. పార్క్‌లో థియేటర్‌ షోలు రద్దు చేశారు. ఈ ప్రారంభం నేపథ్యంలో డిస్నీ షేరు విలువ ఈ నెల 5 తరువాత 8% పెరిగింది.

ఒకటే పార్క్‌.. ఎవరి వరుస వారిదే

ఆస్ట్రియాలోని వియన్నాలో భౌతిక దూరం పాటించేందుకు వీలుగా అనేక మార్గాలతో పార్క్‌ని నిర్మించారు. ప్రతి మార్గానికి ప్రారంభంలో గేటు ఉంటుంది. ఒక్కో మార్గంలో ఒక్కరు మాత్రమే వెళ్లి నడక, వ్యాయామం చేసుకోవచ్చు.

ఎప్పుడు ప్రారంభించవచ్చు

ఏ దేశమైనా లాక్‌డౌన్‌ ఎత్తివేయాలంటే ఈ 4 అంశాలు చూడాలని నిపుణులు సూచిస్తున్నారు.

1.ఆసుపత్రి సేవలు అవసరం ఉన్న ప్రతి కరోనా బాధితుడినీ చేర్చుకొని తగిన సేవలు అందించగల వైద్య సేవల సామర్థ్యం ఉండడం.

2. లక్షణాలున్న ప్రతి ఒక్కరికీ పరీక్షలు నిర్వహించగల సామర్థ్యం.

3. ప్రతి పాజిటివ్‌ కేసునీ, వారితో సంబంధం ఉన్నవారిని పర్యవేక్షించడం.

4.గత 14 రోజులుగా కేసుల నమోదులో తగ్గుదల కొనసాగడం.

మన దేశంలో

రైళ్ల కూత

సాధారణ ప్రజారవాణాకు సంబంధించి మంగళవారం దేశ రాజధాని దిల్లీ నుంచి 15 రైళ్లు రోజువారీగా రాకపోకలు సాగించబోతున్నాయి. త్వరలోనే పరిమితంగానే అయినా ప్రజా రవాణా మొదలయ్యే అవకాశాలున్నాయి. ఇరుకిరుకుగా, తోసుకుంటూ కిక్కిరిసిన రైళ్లు, బస్సులు, మెట్రోలు, రెట్టింపు జనంతో ఆటోలు.. కరోనాకు ముందు పరిస్థితి ఇది. ఇకపై 40 మంది ప్రయాణించే బస్సులో 20 మందికే అవకాశం. ఇలాంటి ఎన్నో ప్రణాళికలను ఆర్టీసీలు ఆచరణలోకి తేబోతున్నాయి. లేకుంటే మొదటికే మోసం వస్తుందిగా మరి!

స్వస్థలాలకు వలస కూలీలు

ఏటా వివిధ ప్రాంతాల నుంచి పనుల కోసం దాదాపు 4.5 కోట్ల మంది భారతీయులు దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు వలస వెళతారని అంచనా. లాక్‌డౌన్‌ అమలుతో ఇతర ప్రాంతాల్లో ఉన్న ఇలాంటి లక్షల మంది కూలీలు పనిలేక, ఆవాసం లేక రోడ్డున పడ్డారు. ఈ పరిస్థితుల్లో పలువురు కాలినడకనైనా వందల కిమీ దూరంలోని తమ స్వస్థలాలకు వెళ్లేందుకు సాహసించారు. ఇలాంటివారిని ప్రస్తుతం బస్సులు, ప్రత్యేక రైళ్లలో వారి స్వస్థలాలకు చేరుస్తున్నారు. ఇతర దేశాల్లోని భారతీయులను విమానాలు, నౌకల్లో తీసుకొస్తున్నారు.

Last Updated : May 12, 2020, 11:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.