అఫ్గానిస్థాన్‌లో(Afghanistan news) ప్రజస్వామ్యం ఇక ఉండబోదని తాలిబన్లు(Taliban) వెల్లడించారు. దేశాన్ని ఓ కౌన్సిల్(Taliban leadership council) ద్వారా పరిపాలించనున్నారు. తాలిబన్ సుప్రీం లీడర్ హోదాలో హైబతుల్లా అఖుండ్‌జాదా వ్యవహరిస్తారని ఆ సంస్థ ప్రతినిధి వహిబుల్లా హషీమీ ఓ ఆంగ్ల వార్త సంస్థకు వెల్లడించారు. అంతేకాదు ఇప్పటికే తాలిబన్లు అఫ్గాన్ పైలట్లు, సైనికులను కూడా సంప్రదించి వారిని విధుల్లో చేరాలని సూచించినట్లు పేర్కొన్నారు. వీరిలో ఎంత మంది విధుల్లో చేరతారనేది మాత్రం ఇప్పటికీ అస్పష్టంగానే ఉంది.
గతంలోని విధానమే..
అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ కౌన్సిల్ పాలన(Taliban leadership council) కొత్తేమీ కాదు. 1996-2001 వరకు నాటి తాలిబన్ చీఫ్‌గా ముల్లా ఒమర్ వ్యవహరించారు. ఆయన చాలా కాలం అజ్ఞాతంలోనే ఉన్నారు. రోజువారీ పాలన మాత్రం కౌన్సిల్ చూసుకొనేది. అదే విధంగా ఇప్పుడు కూడా అఖుండ్‌జాదా కౌన్సిల్ పై స్థానంలో ఉంటారు. ఆయన కింద ఉన్న వ్యక్తి అధ్యక్షుడి బాధ్యతలను నిర్వహిస్తారు. అఖుండ్‌జాదా కింద మౌల్వీ యాకూబ్, సిరాజుద్దీన్ హక్కానీ, అబ్దుల్ ఘనీ బరాదర్ ఉన్నారు. పాలనకు సంబంధించిన చాలా అంశాలపై తాలిబన్లు ఓ నిర్ణయానికి రాలేదని వహిబుల్లా హషీమీ తెలిపారు. షరియా చట్టం అమలు ఉంటుదని వెల్లడించారు. కానీ, ప్రజాస్వామ్యం మాత్రం ఉండబోదని స్పష్టం చేశారు. అటువంటి వ్యవస్థకు తమ దేశంలో పునాది లేదని వివరించారు.
యుద్ధ విమానాల వాడకంపై దృష్టి..!
కొన్నాళ్ల క్రితం వరకు అఫ్గాన్ పైలట్లను తాలిబన్లు లక్ష్యంగా చేసుకొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రభుత్వ, తాలిబన్ బలగాలను కలిపి ఓ సైన్యం ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు హషీమీ వెల్లడించారు. అఫ్గాన్ సైన్యంలో విదేశాల్లో శిక్షణ పొందిన వారు ఉండటంతో వారిని విధుల్లోకి తీసుకొంటున్నట్లు వెల్లడించారు. సైన్యంలో సంస్కరణలు చేయాల్సి ఉందని.. కానీ, వారు తమకు అవసరమని హషీమీ వెల్లడించారు. తాము స్వాధీనం చేసుకొన్న విమానాలు, హెలికాప్టర్లు విమనాశ్రయాల్లో పడి ఉండటం వల్ల పైలట్ల అవసరం ఉందని తెలిపారు. వారిని సంప్రదించి తిరిగి విధుల్లో చేరమని కోరుతున్నామన్నారు. "వారి సోదరులతో కలవండి.. వారి ప్రభుత్వంలో చేరండి" అని అన్నారు. పొరుగు దేశాల్లో ఉన్న 22 విమానాలు, 24 హెలికాప్టర్లను వాపస్ ఇవ్వాలని కోరుతున్నట్లు చెప్పారు. గతంలో అమెరికాలోని ట్విన్ టవర్లపై విమానాలతో దాడికి తాలిబన్లు ఆశ్రయం ఇచ్చిన అల్ ఖైదా ఉగ్రమూకే కారణం. ఇప్పుడు తాలిబన్ల దగ్గరకు శిక్షణ పొందిన పైలట్లు వస్తే వారిని ఎలా వినియోగించుకొంటారో తెలియని పరిస్థితి.
ఉజ్బెకిస్థాన్‌లో భారీగా అఫ్గాన్ యుద్ధ విమానాలు..
తాలిబన్లు కాబుల్‌లోకి ప్రవేశించడం వల్ల హమీద్ ఖర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో అమెరికా ఇచ్చిన డజన్ల కొద్దీ యుద్ధ విమానాలు, హెలికాప్టర్లను పొరుగున ఉన్న ఉజ్బెకిస్థాన్‌లోని తర్మీజ్ ఎయిర్ పోర్టుకు తరలించారు. వీటిల్లో ఏ-29 సూపర్ టూకోన్ యుద్ధవిమానాలు 22 వరకు ఉన్నాయి. ఇక బ్లాక్ హాక్‌తో కలిపి 26 హెలికాప్టర్లు ఉన్నాయి. కానీ, ఉజ్బెకిస్థాన్ ప్రభుత్వం మాత్రం 22 విమానాలు 24 హెలికాప్టర్లు మాత్రమే ఉన్నట్లు అధికారిక ప్రకటనలో పేర్కొంది. అఫ్గాన్ సరిహద్దులు దాటి ఇవి వచ్చేయడం వల్ల బలవంతంగా తమ భూభాగంలో దింపామని పేర్కొంది.
ఇదీ చూడండి: Afghan crisis :మా పిల్లల్ని కాపాడండి.. కంచెల పైనుంచి విసిరేస్తున్న మహిళలు