చైనాలో ఉద్భవించి ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న భయంకర మహమ్మారి కరోనా వైరస్.. గబ్బిలాల నుంచే వ్యాపించి ఉండొచ్చని పలు పరిశోధనలు చెబుతున్నాయి. 'నేచర్' జర్నల్‌లో ప్రచురితమైన రెండు అధ్యయనాలు ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి.
మొదటి అధ్యయనంలో ఫుడాన్ విశ్వవిద్యాలయంలోని యోంగ్జెన్ ఝాంగ్ బృందానికి చెందిన పరిశోధకులు.. వైరస్‌కు సంబంధించి జన్యు శ్రేణి పరీక్షలు నిర్వహించారు. సముద్ర ఆహార మార్కెట్లో పనిచేసే వైరస్ లక్షణాలు ఉన్న ఓ వ్యక్తిపై ఈ పరిశోధన చేశారు. యాంటీ బయాటిక్, యాంటీ వైరల్, గ్లూకొకోర్టికోయిడ్ థెరపీ వంటి ప్రక్రియలు చేపట్టారు. అయితే ఆ వ్యక్తి ఆరోగ్యం కుదుటపడలేదు. ఆ తర్వాత రోగి ఊపిరితిత్తుల స్రావాన్ని సేకరించి వాటిపై పరిశోధన నిర్వహించారు.
గతంలో చైనాలోనే సంభవించిన సార్స్ వైరస్ జన్యువుతో ఈ ప్రమాదకర వైరస్‌కు 89.1 శాతం పోలికలు ఉన్నట్లు తేల్చారు. అయితే ఒక్క వ్యక్తిపై చేసిన పరిశోధన ద్వారా దీనిపై పూర్తి అవగాహనకు రాలేమని చెబుతున్నారు పరిశోధకులు.
మరో అధ్యయంలోనూ
నేచర్ జర్నల్‌లో ప్రచురితమైన మరో అధ్యయనం సైతం దాదాపు ఇదే రకమైన ఫలితాలు వెల్లడించింది. కరోనా వైరస్‌కు సార్స్‌తో పోలికలు ఉన్నట్లు తేల్చింది. కరోనా వైరస్ మూలాలు గబ్బిలాలలో ఉన్నట్లు పేర్కొంది. అయితే వైరస్ వ్యాప్తికి కారణమైన జంతువును గుర్తించలేదని వెల్లడించింది.
వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి చెందిన ఝెంగ్ లీ షీ బృందం న్యుమోనియా సోకిన ఏడుగురి నమూనాలను సేకరించింది. ఇందులో ఆరుగురు సముద్ర ఆహారం అమ్మే మార్కెట్లో పనిచేసే వారే కావడం గమనార్హం. వీరందరి నమూనాలు పరీక్షించిన ఝెంగ్ బృందం ఈ జన్యువుకి సార్స్ వైరస్‌తో 79.5 శాతం పోలిక ఉన్నట్లు స్పష్టం చేసింది. ఇందులో ఐదుగురి జన్యువులు మరొకరి జన్యువులతో 99.9 శాతం పోలిక ఉన్నట్లు వెల్లడించింది.
సార్స్ మాదిరిగానే
జన్యు పరంగా గబ్బిలాల కరోనా వైరస్‌కు ఈ నమూనాలతో 96 శాతం పోలిక ఉన్నట్లు తేల్చారు పరిశోధకులు. ఈ నేపథ్యంలో గబ్బిలాల నుంచే ఈ వైరస్ ఉద్భవించిందని అభిప్రాయపడుతున్నారు. సార్స్ వైరస్‌లో ఉండే ఏడు నాన్ స్ట్రక్చరల్ ప్రోటీన్ల జాడను కూడా ఇందులో గుర్తించినట్లు తెలిపారు. 2019లో దీనిని నావెల్ కరోనావైరస్‌గా పిలిచారని... సార్స్ వైరస్ మాదిరిగానే ఓసీఈ2 కణాల ద్వారా ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుందని వెల్లడించారు.
425 మంది మృతి..
2019 డిసెంబర్లో చైనాలోని సెంట్రల్ హుబెయి ప్రావిన్స్‌లో తొలి కరోనా వైరస్ కేసు నమోదైంది. అనంతరం క్రమక్రమంగా 25 దేశాలకు వ్యాపించింది. ఈ వైరస్ ధాటికి ఇప్పటికే చైనాలో 425 మంది ప్రాణాలు కోల్పోగా... 20,400 మందికిపైగా వైరస్ సోకినట్లు గుర్తించారు. భారత్‌లోనూ ముగ్గురికి ఈ వైరస్ సోకినట్లు ధ్రువీకరించారు.