Corona cases in China: ప్రపంచంలోని అన్ని దేశాల కంటే కఠిన నిబంధనలు అమలు చేస్తున్నప్పటికీ చైనాలో కరోనా కేసులు మాత్రం తగ్గటం లేదు. గత 10 రోజులుగా లాక్‌డౌన్‌లో ఉన్న జియాన్ నగరంలో కొవిడ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. జీరో కొవిడ్ వ్యూహంతో నానా తంటాలు పడుతున్నా.. చైనాలో తాజాగా 200 కేసులు బయటపడ్డాయి. ఈ విషయాన్ని అక్కడి అధికారులు తెలిపారు. జియాన్ నగరంలో గత పది రోజులుగా లాక్‌డౌన్ కారణంగా 1.3 కోట్ల మంది ఇళ్లకే పరిమితమయ్యారు. అయినప్పటికీ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. స్థానికంగా వ్యాపించిన 122 కేసులు వెలుగుచూసినట్లు అధికారులు పేర్కొన్నారు. అందులో 104 మంది క్వారంటైన్‌లో ఉన్నవారు కాగా.. మరో 18 మందికి 'న్యూక్లియాక్ యాసిడ్' పరీక్షలో వైరస్ సోకినట్లు తేలిందన్నారు.
డిసెంబర్ 9న తొలి కేసు బయటపడిన జియాన్ నగరంలో మొత్తం కేసుల సంఖ్య 1573కు చేరినట్లు ప్రభుత్వ అధికార మీడియా తెలిపింది. వారిలో 8మంది కోలుకోగా ముగ్గురి పరిస్థితి విషమంగా, మరో 10 మంది పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. మిగతా వారికి స్వల్ప, తేలికపాటి లక్షణాలు ఉన్నట్లు వివరించారు. వచ్చే ఫిబ్రవరి 4వ తేదీ నుంచి ప్రారంభమయ్యే శీతాకాల ఒలింపిక్స్‌ను దృష్టిలో ఉంచుకొని జీరో కొవిడ్ వ్యూహాన్ని అమలు చేస్తున్నప్పటికీ చైనాలో కరోనా కేసులు తగ్గటం లేదు.
కొవిడ్ విస్తృతంగా వ్యాపిస్తున్న సమయంలో కట్టడి చర్యలు, వ్యాక్సిన్ పంపిణీ, వైరస్‌తో కలిసి జీవించే వ్యూహంతో ప్రపంచ దేశాలు ముందుకెళుతున్నాయి. అయితే చైనా మాత్రం కేసుల సంఖ్యను సున్నాకు తీసుకువచ్చే జీరో కొవిడ్ వ్యూహాన్నే నమ్ముకుంది. తాజాగా డెల్టాతోపాటు ఒమిక్రాన్ ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా కేసులు పెరగడంతో డ్రాగన్ దేశం ఆందోళన చెందుతోంది. ముఖ్యంగా అక్కడ కొత్త సంవత్సరం (ఫిబ్రవరి 1), వింటర్ ఒలింపిక్స్ సమీపిస్తుండడంతో వైరస్‌ను కట్టడి చేయలేక తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చూడండి: కార్చిచ్చుతో వెయ్యి ఇళ్లు దగ్ధం.. ఆపై మంచు తుపాను