పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో 1.5 కోట్ల డాలర్ల విలువైన 'ఆజాద్ పత్తాన్' జల విద్యుత్తు ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన ఒప్పందంపై చైనా-పాకిస్థాన్‌లు సోమవారం సంతకం చేశాయి. ఇరుదేశాలు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న 'చైనా-పాకిస్థాన్ ఆర్థిక నడవా (సీపెక్)' లో భాగంగా ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు పాక్ పేర్కొంది. పీవోకే ప్రాంతంలోని జీలం నదిపై నిర్మించనున్న 700 మెగావాట్ల జల విద్యుత్తు ప్రాజెక్టు వల్ల చౌకైన, సురక్షిత విద్యుత్తు లభిస్తుందని తెలిపింది.
2026 నాటికి నిర్మాణం పూర్తవుతుందని వివరించింది. ఈ సందర్భంగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ 'చైనా అభివృద్ధి నుంచి మేమెంతో నేర్చుకున్నాం. సీపెక్ ప్రాజెక్టు ద్వారా పాకిస్థాన్ తప్పకుండా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుంది.' అని అన్నారు. చైనలోని జిన్ జియాంగ్ ప్రావిన్సును బలూచిస్థాన్‌లోని గ్వాదర్ పోర్టుకు అనుసంధానించే సీపెక్ ప్రాజెక్టు పీవోకే గుండా వెళ్తుండటం వల్ల దాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
ఇదీ చూడండి: ప్రయాణాలపై ఆంక్షల ఎత్తివేతకు ఇమ్రాన్ విజ్ఞప్తి