చైనాలో అభివృద్ధి చేస్తున్న ‘కరోనా వాక్’ వ్యాక్సిన్ సత్ఫలితాలిస్తున్నట్లు ఓ అధ్యయనం పేర్కొంది. తాజాగా జరిపిన ప్రాథమిక ప్రయోగాల్లో వైరస్‌ను ఎదుర్కొనే సమర్థమైన యాంటీబాడీల్ని ఈ వ్యాక్సిన్ ఉత్పత్తి చేసినట్లు తేలింది. ఈ మేరకు ‘లాన్సెట్ ఇన్‌ఫెక్షియస్ డిసీజెస్ జర్నల్’లో అధ్యయన వివరాలు ప్రచురితమయ్యాయి.
చైనాకు చెందిన సినోవాక్ బయోటెక్ అనే సంస్థ కరోనావాక్ టీకాను అభివృద్ధి చేస్తోంది. ఏప్రిల్ 16 నుంచి మే 5వ తేదీ మధ్య మొత్తం 700 మంది వాలంటీర్లపై ఈ టీకాను ప్రయోగించారు. 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయసుగల వారికి మాత్రమే వ్యాక్సిన్‌ను ఇచ్చారు. 14 రోజుల వ్యవధిలో రెండు డోసులు ఇచ్చి పరీక్షించారు. కనిష్ఠ డోసు తీవ్రతతో కూడా మెరుగైన రోగనిరోధకత ఏర్పడిందని అధ్యయనంలో పేర్కొన్నారు. వ్యాక్సిన్ ఇచ్చిన ప్రాంతంలో నొప్పి మినహా ఇతరత్రా దుష్ప్రభావాలేమీ కనిపించలేదన్నారు.
అయితే, కరోనా నుంచి కోలుకున్న వారిలో ఉండే యాంటీబాడీలతో పోలిస్తే.. ఈ టీకా వల్ల ఉత్పత్తయిన యాంటీబాడీలు తక్కువ అని అధ్యయన ఫలితాల్లో పేర్కొన్నారు. అయినా, వైరస్‌ను నిలువరించే స్థాయిలో యాంటీబాడీలు ఉత్పత్తవుతున్నాయని వివరించారు. టీకా ఇచ్చిన 28 రోజుల్లో రోగనిరోధకత ఏర్పడుతుందని తెలిపారు. మొత్తం 14 రోజుల వ్యవధితో రెండు రకాల డోసుల్లో ఈ వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంటుందని వెల్లడించారు. మూడు మైక్రోగ్రాముల డోసుతో కావాల్సిన స్థాయిలో యాంటీబాడీలు ఉత్పత్తవుతున్నట్లు కనుగొన్నారు.
‘‘మహమ్మారి ఇంకా తీవ్ర స్థాయిలో వ్యాపిస్తున్న ఈ తరుణంలో కరోనా వాక్‌ను ‘అత్యవసర అనుమతి’ ద్వారా వినియోగించవచ్చని మేం విశ్వసిస్తున్నాం. కొవిడ్ విజృంభణ తగ్గిన తర్వాత.. తొలి డోసుకి రెండో డోసుకు మధ్య నెల రోజుల వ్యవధి ఉంటే ఇంకా మెరుగైన ఫలితాలు వస్తాయని మా అధ్యయనం సూచిస్తోంది. దీనివల్ల దీర్ఘకాలం మనగ్గలిగే మరింత బలమైన రోగనిరోధకత ఏర్పడుతుందని భావిస్తున్నాం. అయితే, వ్యాక్సిన్ షెడ్యూల్‌పై ఇంకా లోతైన పరిశోధన జరగాల్సి ఉంది’’ అని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన వారిలో ఒకరైన ఫెంగ్‌సాయ్ జూ తెలిపారు.
ఇదీ చూడండి:టీకా విషయంలో మరో శుభవార్త చెప్పిన మోడెర్నా