వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంట తన సైనిక బలగాలను బలోపేతం చేసుకోవడానికి చైనా సరికొత్త వ్యూహాన్ని ఎంచుకొంది. భారత సరిహద్దుల్లో ఉండే తీవ్ర ప్రతికూల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని టిబెట్ యువతను పెద్ద ఎత్తున పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్‌ఏ)లో చేర్చుకుంటోంది. ప్రతి ఇంటి నుంచి ఒకరు సైన్యంలో చేరేలా నిర్బంధ విధానాన్ని అనుసరిస్తోంది. అదే సమయంలో టిబెట్ యువకుల్ని అన్ని విధాలా పరీక్షిస్తోంది.
చైనా పట్ల విధేయత, కమ్యూనిస్టు పార్టీ ఆధిపత్యాన్ని అంగీకరించడంతో పాటు చైనీస్ భాషను నేర్చుకొని ఉండడం వంటివి ప్రధాన అర్హతలుగా నిర్దేశించింది. భారత సైన్యంతో తూర్పు లద్దాఖ్‌లో కొనసాగిన తీవ్ర ప్రతిష్టంభన సమయంలో సరిహద్దు శిబిరాల వద్ద అతిశీతల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటూ విధులు నిర్వహించడం ఎంత కష్టతరమో చైనా సైన్యానికి తెలియవచ్చింది. సుదీర్ఘకాలం అక్కడ విధులు నిర్వహించడమంటే ప్రాణాలను ఫణంగా పెట్టడమేనని అర్థమయ్యింది.
భారత సైన్యంలో..
అదే సమయంలో భారత సైన్యంలో ఉన్న ప్రవాస టిబెటన్లతో కూడిన ప్రత్యేక ప్రాదేశిక దళాలు సమర్థవంతంగా విధులు నిర్వహించడాన్ని చైనా గమనించింది. దీంతో తన నియంత్రణలో ఉన్న టిబెట్ స్వయంప్రతిపత్తి ప్రాంత(టీఏఆర్) యువకులపై దృష్టి సారించింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే నియామకాలను ప్రారంభించింది. ఇప్పుడు వారందరికీ మంచుకొండల్లోని సైనిక శిబిరాల్లో శిక్షణ కొనసాగుతోందని విశ్వసనీయ వర్గాల సమాచారం. టిబెట్ యువకులతో కూడిన సైనిక దళాలను భారత్ సరిహద్దుల వెంట మోహరిస్తే...ఆ మేరకు ప్రధాన ఆర్మీపై ఒత్తిడి తగ్గించుకోవచ్చనీ చైనా భావిస్తోంది.
ఇదీ చదవండి: