కరోనా సంక్షోభం నుంచి తిరిగి చైనా ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతోంది. నవంబర్ నెలలో దేశ తయారీ రంగం గణనీయమైన వృద్ధిని సాధించినట్లు ఓ సర్వేలో తేలింది. మరోవైపు ఆంక్షలు, మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటం వల్ల అమెరికా, ఐరోపా ఆర్థిక వ్యవస్థలు మందగమనంలో ఉన్నాయి.
చైనా గణాంకాల ఏజెన్సీ విడుదల చేసిన నివేదికలో.. నెలవారీ కొనుగోళ్ల సూచీ 52.1గా నమోదైంది. అక్టోబర్‌లో ఇది 51.4గా ఉంది. కరోనా మహమ్మారి నుంచి కోలుకొని వ్యాపారానికి అనువైన వాతావరణాన్ని జిన్‌పింగ్ ప్రభుత్వం తిరిగి నెలకొల్పినట్లు నివేదిక పేర్కొంది.
కర్మాగారాలు, దుకాణాలు, కార్యాలయాలు తిరిగి తెరుచుకున్నాయి. అయితే విదేశీయుల రాకపై మాత్రం ఆంక్షలు కొనసాగుతున్నాయి. రిటైల్ వ్యయం, ఆటో అమ్మకాలు, పారిశ్రామిక ఉత్పత్తి, ఇతర కార్యకలాపాలు తిరిగి పుంజుకున్నాయి.
పరిశ్రమల ఉత్పత్తి సూచీ నవంబర్ నెలలో 54.7కు పెరిగింది. అక్టోబర్‌లో ఇది 53.9గా ఉన్నట్లు జాతీయ గణాంకాల నివేదికలో స్పష్టమైంది.
అక్టోబర్‌తో పోలిస్తే నవంబర్‌లో కొత్త ఎగుమతులు 51.5 శాతానికి పెరిగాయి. ఇతర దేశాలతో పోలిస్తే ఆర్థిక వ్యవస్థను త్వరగా తిరిగి తెరవడమే చైనా వృద్ధికి కారణమైనట్లు తెలుస్తోంది. మాస్కులు, ఇతర వైద్య పరికరాల ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. ఉపాధి సూచీ 0.2 శాతం పెరిగి 49.5కు చేరింది.