కరోనా తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పేల్చేందుకు చైనా మరో బాంబును సిద్ధం చేసింది. 2008లో 600 బిలియన్ డాలర్లకు దివాలా (2008 Financial Crisis) తీసిన అమెరికా సంస్థ లేమన్ బ్రదర్స్ (Lehman Brothers crisis) తర్వాత ఇదే అతిపెద్ద సంక్షోభం (China Financial Crisis 2021) కావచ్చని ఆర్థిక నిపుణులు ఆందోళన చెందుతున్నారు. చైనాకు చెందిన ఎవర్‌గ్రాండే దివాలా (Evergrande crisis) అంచుకు చేరింది. ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా 300 బిలియన్ డాలర్ల మేరకు చెల్లింపులు (Evergrande default) చేయాల్సి ఉంది. చైనా జంక్ బాండ్స్(పెట్టుబడి గ్రేడ్‌లో లేని సంస్థల బాండ్లు) ఈల్డ్ (China junk bond yield) ఒక్కసారిగా 14.4శాతానికి పెరగడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.
ఎవర్‌గ్రాండే సంస్థ ఏం చేస్తుంది..?
ఎవర్‌గ్రాండే చైనాలో అతిపెద్ద రియల్ ఎస్టేట్ దిగ్గజం. (China real estate company bankrupt) ఈ సంస్థ 280 నగరాల్లో దాదాపు 1,300 రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను చేపట్టింది. చైనా రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో (China real estate market) 2శాతం వాటా దీనిదే. 15లక్షల మందికి ఇళ్లు నిర్మించి ఇవ్వాల్సి ఉంది. వారందరూ సంస్థకు డబ్బులు చెల్లించిన వారే. కానీ, ప్రస్తుతం ఎవర్‌గ్రాండే సంస్థ ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉంది. ఇక మెటీరియల్ పంపిణీదారులకు కొన్ని నెలల నుంచి చెల్లింపులు చేయడంలేదు. ఈ కంపెనీ ఆర్థిక ఇబ్బందులు చైనాలో ఒక ట్రిలియన్ డాలర్ల విలువైన స్థిరాస్తి ప్రాజెక్టులపై పడనుంది.
ప్రమాద ఘంటికలు..
ఎవర్‌గ్రాండే సంస్థ చేపట్టిన ప్రాజెక్టుల (Evergrande Projects) పరంగా.. దేశీయంగా ఆర్థిక కార్యకలాపాలు చాలా భారీగా ఉన్నాయి. ఈ సంస్థ జారీ చేసిన బాండ్లపై సెప్టెంబర్ 23నాటికి కట్టాల్సిన 80 మిలియన్ డాలర్ల వడ్డీని చెల్లించలేనని ఇటీవల ప్రకటించింది. దీంతో ఒక్కసారిగా దీని ఇన్వెస్టర్లు షాక్‌కు గురయ్యారు. చైనా ప్రభుత్వం కూడా దీనిని ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడేయటానికి ఎటువంటి ప్రణాళికలను ప్రకటించలేదు.
మందగించిన రియల్ ఎస్టేట్ మార్కెట్..
హార్వర్డు-సింగ్వా యూనివర్సిటీ పరిశోధన ప్రకారం చైనా జీడీపీలో 29శాతం రియల్ ఎస్టేట్ రంగం (China GDP real estate percent) నుంచే లభిస్తోంది. కొన్నాళ్ల నుంచి చైనాలో రియల్ ఎస్టేట్ మార్కెట్ మందగించడం ఎవర్‌గ్రాండేపై ప్రతికూల ప్రభావం చూపింది. గతనెలలో ఇళ్ల విక్రయాలు 20శాతం పడిపోయినట్లు చైనా నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ డేటా పేర్కొంది. ప్రస్తుతం 6.5 కోట్ల ప్రాపర్టీలు ఖాళీగా పడిఉన్నాయి.
ప్రపంచాన్ని ఆకర్షించిన బాండ్ మార్కెట్..
చైనాలో బాండ్ మార్కెట్‌లో ఆకర్షణీయమైన ఈల్డింగ్స్ ఉండటంతో పలు దేశాల సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టాయి. వీటిల్లో ప్రపంచ స్థాయి బీమా కంపెనీలు, పింఛను ఫండ్స్, అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థలు, సావరీన్ వెల్త్ ఫండ్స్ ఉన్నాయి. ఇదే సమయంలో చైనా రియల్ ఎస్టేట్ డెవలపర్స్ బాండ్లు కనీసం 10శాతం ఈల్డింగ్స్ ఇవ్వడం ఆకర్షణీయంగా మారింది. బ్లాక్ రాక్, ఎమ్యూండ్, యూబీఎస్ అసెట్ మేనేజ్‌మెంట్, హెచ్‌ఎస్‌బీఎస్ హోల్డింగ్స్, ఫిడిలిటీ, పీఐఎంసీవో,గోల్డ్‌మన్ సాక్స్ అసెట్ మేనేజ్‌మెంట్ వంటి దిగ్గజాలు వీటిల్లో పెట్టుబడులు పెట్టాయి.
2020లోనే కళ్లెం వేసిన పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా..
పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా రియల్ ఎస్టేట్ డెవలపర్స్ విచ్చలవిడిగా రుణాలు తీసుకోకుండా 2020లో కళ్లెం వేసింది. రుణదాతలు ముఖ్యంగా బ్యాంకు సూచించిన త్రీరెడ్ లైన్స్ (మూడు నిబంధనలు) దృష్టిలో పెట్టుకొని రుణాలు ఇవ్వాలని పేర్కొంది. నిబంధనలకు అనుగుణంగా ఉన్న కంపెనీలకు మరుసటి ఏడాది రుణాన్ని పెంచుకొనేందుకు అనుమతి లభిస్తుంది. జూన్21తో ముగిసే త్రైమాసికానికి ఎవర్‌గ్రాండే సంస్థ త్రీరెడ్‌లైన్స్ నిబంధనలను అందుకోలేకపోయింది. జూన్ 23వ తేదీన ఫిచ్ రేటింగ్ సంస్థ ఎవర్‌గ్రాండే రేటింగ్‌ను బి-ప్లస్ నుంచి ‘బి’కి కుదించింది.
ఎవర్‌గ్రాండే కుప్పకూలితే..
ఎవర్‌గ్రాండే కుప్పకూలితే ఇప్పటికే చైనాలో ఖాళీగా ఉన్న 6.5 కోట్ల ఇళ్ల ధరల్లో పతనం మొదలవుతుంది. చైనీయుల సంపదలో చాలా భాగం రియల్‌ఎస్టేట్ రంగంలో ఉంది. ఫలితంగా చైనీయుల వ్యయాలు గణనీయంగా తగ్గే ప్రమాదం ఉంది. అంతేకాదు చైనా బాండ్ మార్కెట్‌పై కూడా ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. ఇప్పటికే చైనాకు 92 ట్రిలియన్ డాలర్ల అప్పు ఉంది. ఇది ఆ దేశ జీడీపీతో పోలిస్తే 353 శాతం ఎక్కువ. ఇప్పుడు కీలకమైన రియల్ ఎస్టేట్ మార్కెట్ మందగిస్తే చైనాకు ఆర్థిక కష్టాలు తప్పవు.
చైనాకు ఆర్థిక కష్టాలు వస్తే ఐరోపా దేశాల విలాసవంతమైన వస్తువుల తయారీ పరిశ్రమలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఈ రంగాల 50శాతం ఆదాయం చైనా నుంచి వస్తోంది. చైనా వద్ద దాదాపు 1.1 ట్రిలియన్ డాలర్ల అమెరికా బాండ్లు ఉన్నాయి. రుణాల చెల్లింపుల కోసం వీటి విక్రయాలు, లేదా యువాన్ విలువ తగ్గించడాలు చేయాల్సి రావచ్చు. ఇరుదేశాల సంబంధాలను ఇది దెబ్బతీయవచ్చు. ఆసియాలో చాలా దేశాలకు చైనా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. అంటే చైనాలో వచ్చే చిన్న ఆర్థిక సంక్షోభం కూడా ఈ దేశాల వ్యాపారంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. భారత్ అత్యధికంగా స్టీల్, ముడి ఇనుము చైనాకు ఎగుమతి చేస్తుంది. ఈ రంగాలపై ప్రతికూలప్రభావం పడనుంది. యువాన్ విలువ పతనం అయితే చైనా సరుకులు మరింత చౌకగా అంతర్జాతీయ మార్కెట్లను ముంచెత్తే ప్రమాదం ఉంది.
భారీగా పతనం అయిన షేరు..
ఎవర్‌గ్రాండే సంక్షోభం విషయం బయటకు రావడంతో సోమవారం హాంకాంగ్ మార్కెట్లలో సంస్థ షేర్లు 15శాతం వరకు కుంగాయి. ఇక హెంగ్‌సెంగ్ ప్రాపర్టీ సూచీ 6శాతం వరకు పతనం అయింది. చైనా బీమా సంస్థ పింగ్ యాన్ షేరు విలువ దాదాపు 8శాతం కుంగింది.
రిటైల్ ఇన్వెస్టర్ల ఆందోళన..
గత వారం షెన్‌జెన్‌లోని ఎవర్‌గ్రాండే కార్యాలయం వద్ద వందల కొద్దీ రిటైల్ ఇన్వెస్టర్లు ఆందోళనకు దిగారు. కొందరు ఆత్మహత్యాయత్నం చేసినట్లు కూడా వార్తలొచ్చాయి. వీరితో సంస్థకు పంపిణీదారులుగా ఉన్న సంస్థలు కూడా ఈ ఆందోళనకు తోడయ్యాయి. ఇప్పటి వరకు కంపెనీ రుణదాతలు, సప్లైయర్స్‌కు చెల్లించాల్సిన మొత్తం 300 బిలియన్ డాలర్ల వరకు ఉంది.
ఇదీ చదవండి: