అమెరికా తన ప్రచ్ఛన్న యుద్ధ మనస్తత్వాన్ని విడనాడాలని చైనా హితవు పలికింది. ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగించాల్సిన అవసరముందని పేర్కొంది.
"అమెరికా గత రెండేళ్లుగా చైనా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి, చైనా ప్రయోజనాలను అణగదొక్కడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. చైనాపై తప్పుడు ప్రచారం చేస్తోంది. అయితే వీటన్నింటిపై చైనా దీటుగా స్పందించింది."
-జావో లిజియన్, చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి
ట్రంప్ ప్రభుత్వం యూఎస్ కాంగ్రెస్లో ప్రవేశపెట్టిన చైనా స్ట్రాటజీ నివేదికకు స్పందనగా జావో లిజియన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
చైనాకు వ్యతిరేకంగా అమెరికా రూపొందించిన కొత్త నివేదిక.... 2017లో విడుదల చేసిన యూఎస్ జాతీయ భద్రత వ్యూహ నివేదికలానే ఉందని జావో లిజియన్ విమర్శించారు. 'చైనా వల్ల ప్రపంచానికి ముప్పు' అని ట్రంప్ సర్కార్ చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.
"అమెరికా పట్ల చైనా వైఖరి స్థిరంగా, స్పష్టంగా ఉంది. ఘర్షణ పడడం మా ఉద్దేశం కాదు. పరస్పర గౌరవంతో యూఎస్-చైనా సంబంధాలు కొనసాగించడానికి చైనా కట్టుబడి ఉంది. అంతర్జాతీయ సమాజమూ ఇదే ఆశిస్తోంది" అని అన్నారు జావో లిజియన్.
మమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు..
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ) బలమైన నాయకత్వంలో... సోషలిజం మార్గంలో చైనా ప్రజలు అభివృద్ధి పథంలో దూసుకుపోతూ, గొప్ప విజయాలు సాధిస్తున్నారని జావో లిజియన్ పేర్కొన్నారు. అలాగే ప్రపంచ శాంతికి, స్థిరత్వానికి, అభివృద్ధికి సహకరిస్తున్నారన్నారు. చైనా వృద్ధిని, అభివృద్ధిని ఎవ్వరూ ఆపలేరని జావో లిజియన్ పేర్కొన్నారు.
ఇదీ చూడండి: పాక్ విమాన ప్రమాదంలో అంతుచిక్కని అనుమానాలెన్నో!