ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. మహమ్మారిని కట్టడి చేసేందుకు మాస్క్‌లు ధరించాలని వైద్యులు సూచించిన నేపథ్యంలో వాటి వినియోగం పెరిగింది. దీంతో మార్కెట్లో మాస్క్‌ల కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో చైనా నుంచి పలు దేశాలు మాస్క్‌లను దిగుమతి చేసుకుంటున్నాయి. కానీ చైనా నుంచి వచ్చిన మాస్క్‌ల నాణ్యతపై వైద్య సిబ్బంది, ఇతర వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
ఈ నేపథ్యంలో స్పందించిన చైనా మార్కెట్ నియంత్రణ సంస్థ మాస్క్‌ల నాణ్యతను తనిఖీ చేసింది. నాణ్యత ప్రమాణాలు సరిగా లేని 89 మిలియన్ల మాస్క్‌లు, 4 లక్షల 18 వేల రక్షణ పరికరాలను సీజ్ చేసినట్లు స్టేట్ ఆఫ్ మార్కెట్ రెగ్యులేషన్ డిప్యూటీ డైరెక్టర్ గన్ లిన్ తెలిపారు. అంతేకాకుండా 7.6 మిలియన్ యువాన్ల విలువైన నిష్ప్రయోజనమైన క్రిమి సంహారక మందులను కూడా స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
ఈ తరుణంలో జాతీయ, అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా మాస్క్‌ల తయారీ ఉండాలని ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసినట్లు పేర్కొన్నారు గన్ లిన్. స్పెయిన్, నెదర్లాండ్, క్రెచ్ రిపబ్లిక్, టర్కీ, పలు దేశాల వారు దిగుమతి చేసుకున్న మాస్క్‌లను వెనక్కి పంపించిన కారణంగా మస్క్‌ల తయారీ నిబంధనలను మరింత కఠినతరం చేసింది చైనా.