చైనాలో కరోనా వైరస్ మళ్లీ కలకలం రేపుతోంది. వివిధ నగరాల్లో కేసులు అమాంతం పెరిగిపోతుండటం వల్ల ఆ దేశం వైరస్ కట్టడికి కఠిన చర్యలు చేపట్టింది. ఓ ప్రముఖ నగరాన్ని పూర్తిగా నిర్బంధించడం సహా వైరస్ ఉద్ధృతికి కారణమైన స్థానిక అధికారులకు శిక్షలు విధిస్తోంది.
చైనాలో గతేడాది కరోనా వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి.. కఠిన ఆంక్షలను అమలు చేసి వైరస్ వ్యాప్తిని నిరోధించగలిగింది. అయితే.. అనూహ్యంగా ఇప్పుడు మళ్లీ కేసులు పెరుగుతుండడం ఆ దేశాన్ని ఆందోళనలోకి నెట్టేస్తోంది. చైనాలో కొత్తగా 71 మంది కరోనా సోకినట్లు తేలింది. అందులో సగం కేసులు.. ఒక్క జియాంగ్సు నగరంలోనే నమోదయ్యాయి. కొత్త కరోనా కేసుల్లో చాలా వరకు డెల్టా వేరియంట్‌కు సంబంధించినవేనని సమాచారం.
నగరం బంద్..
పర్యటక ప్రాంతమైన ఝాంగ్జియాజీ నగరంలో కరోనా హాట్‌స్పాట్ మారింది. దీంతో ఆ నగరంలో ఆదివారం కఠిన ఆంక్షలు విధించారు. ప్రజలెవరూ తమ ఇళ్లను వీడి బయటకు రావొద్దని ఆదేశాలు జారీ చేశారు. పర్యటకులైనా, స్థానికులైనా నగరాన్ని వీడి వెళ్లొద్దని నిబంధనలు విధించారు. వైరస్‌ను అడ్డుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్థానిక అధికారులకు శిక్షలు విధించేందుకు సిద్ధమవుతున్నారు.
గతవారం నుంచి ఝాంగ్జియాజీ నగరంలో 19 కరోనా కేసులు వెలుగు చూశాయి. అందులో ముగ్గురికి ఎలాంటి లక్షణాలు లేకుండానే కరోనా సోకినట్లు తేలింది. ఝాంగ్జియాజీ నగరం నుంచి మరో ఐదు రాష్ట్రాలకు కరోనా వ్యాపించిందని షాంఘైకు చెందిన ఓ వార్తా పత్రిక కథనం ప్రచురించింది.
జోరుగా వ్యాక్సినేషన్..
అత్యవసరం కాని ప్రయాణికులకు పాస్‌పోర్టుల మంజూరు నిలిపివేత మరికొన్నాళ్లపాటు కొనసాగుతుందని చైనా అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు.. ఆ దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా జోరుగానే కొనసాగుతోంది. మంగళవారం నాటికి 171 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఆ దేశం పంపిణీ చేసింది. అయితే.. ఎంతమంది చైనీయులకు రెండు డోసుల టీకా అందిన్నదానిపై స్పష్టత లేకపోయినా.. ఆ దేశ జనాభాలో 40శాతం మందికి రెండు డోసులు అందాయని సమాచారం.
లక్ష దాటిన మరణాలు
మరోవైపు.. ఇండోనేసియాలోనూ కరోనా బీభత్సం సృష్టిస్తోంది. కొత్తగా వైరస్ ధాటికి 1,747 మంది వైరస్ ధాటికి ప్రాణాలు కోల్పోగా.. ఆ దేశంలో మొత్తం మరణాల సంఖ్య 100,636కు పెరిగింది.
ఇండోనేసియాలో మరణాల సంఖ్య 50 వేల మార్కును దాటేందుకు 14 నెలల సమయం పట్టగా.. కేవలం 9 నెలల్లోనే ఆ సంఖ్య రెట్టింపు కావడం గమనార్హం.