బ్యాంకాక్‌లోని ఆసియాన్ సమావేశంలో భాగంగా.. ఆర్సెప్ ఒప్పందంపై సంప్రదింపులు ఎంతో స్ఫూర్తివంతమైన పురోగతిని సాధించాయని అభిప్రాయపడింది చైనా. అయితే ఈ ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం.. సభ్య దేశాల అంచనాలను ఇంకా అందుకోలేదని తెలిపింది.
ఒప్పందం కుదిరితే.. చైనా చౌక ధర సరుకులు భారత్‌లోకి వెల్లువెత్తుతాయని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తం చేసిన కొన్ని రోజులకు డ్రాగన్ దేశం ఈ ప్రకటన చేసింది.
'ఒప్పందం కుదుర్చుకోవడానికి సాగిన చర్చలు.. సభ్యదేశాల అంచనాలు అందుకోలేకపోయాయి. కానీ ఈసారి ఎంతో స్ఫూర్తివంతమైన పురోగతి సాధించాం. త్వరగా ఒప్పందంపై సంతకాలు చేయడానికి సభ్యదేశాలు కృషి చేయాలని నిర్ణయించాయి.'
--- జెంగ్ షుయాంగ్, చైనా విదేశాంగ ప్రతినిధి.
ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ఆర్సెప్ ఎంతో ముఖ్యమైన ఒప్పందమని అభిప్రాయపడ్డారు జెంగ్.
భారత్ నుంచి న్యూజిలాండ్ వరకు 16 దేశాల మధ్య ఆర్సీఈపీ ఒప్పందం కుదరాల్సి ఉంది. ప్రపంచంలో సగం జనాభా ఈ దేశాల్లోనే ఉంది. మార్కెట్ అందుబాటు సంబంధిత చర్చలు చాలావరకు పూర్తయ్యాయని, కొద్దిపాటి ద్వైపాక్షిక అంశాలు 2020 ఫిబ్రవరి నాటికి కొలిక్కి వస్తాయని ముసాయిదా ఒప్పందంలో పేర్కొన్నారు.
ఇదీ చూడండి:- ఆర్సీఈపీ ఒప్పందం ఇప్పుడు లేనట్లే..!