కరోనా నివారణ కోసం రూపొందిస్తున్న ప్రయోగాత్మక టీకాలను చైనాలో విచ్చలవిడిగా ఇచ్చేస్తున్నారు. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఉచితంగా వీటిని ఓ బయోటెక్ సంస్థ ఇస్తోంది. చైనాలో మొత్తంమీద ఐదు టీకాలు తుది దశ క్లినికల్ పరీక్షల్లో ఉన్నాయి. వీటిలో ఒక్కటి కూడా సాధారణ వినియోగానికి ఆమోదం పొందలేదు. అయితే ఈలోగా ' అత్యవసర వినియోగం' కింద లక్షల మందికి వ్యాక్సిన్లను ఇస్తున్నారు.
సినోవ్యాక్స్ అనే సంస్థ అభివృద్ధి చేస్తున్న టీకాను తమ నగరంలో 'ఎమర్జెన్సీ అవసరాలు' అన్న పౌరులకు ఇవ్వనున్నట్లు జియాక్షింగ్ నగర పాలక సంస్థ అధికారులు గురువారం ప్రకటించారు.
మరో సంస్థ చైనా నేషనల్ బయోటెక్ గ్రూప్(సీఎన్బీజీ).. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఉచితంగా తమ టీకాను ఇస్తోంది. 1.68 లక్షల మందికిపైగా విద్యార్థులు ఇందుకోసం నమోదు చేసుకున్నారు. వీరిలో 91 వేల మందికి టీకాను ఇవ్వాలని కంపెనీ అధికారులు భావిస్తున్నారు. దీనిపై ఆరోగ్య నిపుణులు భద్రత, నైతిక విలువలకు సంబంధించిన ప్రశ్నలను లేవనెత్తుతున్నారు.
" టీకా పనిచేయకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. తాము సురక్షితమన్న భావనను అది సదరు వ్యక్తుల్లో కలిగిస్తుంది "
-శ్రీధర్ వెంకటాపురం, జీవపరమైన నైతిక విలువల నిపుణుడు, కింగ్స్ కాలేజీ లండన్.
ఫలిస్తున్న మరో టీకా..
కొవిడ్ నివారణకు చైనాలో అభివృద్ధి చేస్తున్న బీబీఐబీపీ-కోర్వీ టీకా ఆశించిన ఫలితాన్ని ఇచ్చిందని శాస్త్రవేత్తలు తెలిపారు. స్వల్పస్థాయిలో తొలి దశలో నిర్వహించిన మానవ ప్రయోగాల్లో ఈ విషయం వెల్లడైందన్నారు.
1.1 కోట్ల మందికి పరీక్షలు
మరోవైపు చైనా తీర ప్రాంతంలోని క్వింగ్డావో నగరంలో ప్రభుత్వం 1.1 కోట్ల మందికి కొవిడ్ పరీక్షలను నిర్వహించింది. అక్కడి ఛాతీ ఆసుపత్రిలో కొత్తగా కేసులు వెలుగుచూసిన నేపథ్యంలో ఈ చర్యను చేపట్టింది.
ఇదీ చదవండి:ఆ కరోనా వ్యాక్సిన్ ధర రూ.4,399..!