కరోనా సంక్షోభాన్ని జయించిన చైనా.. ఆర్థిక రంగంలో శరవేగంగా దూసుకుపోతోంది. వాణిజ్య కార్యకలాపాలకు ఊతమందిస్తూ.. తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. కరోనా తీవ్రత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ నెల 20 నుంచి థియేటర్లకు అనుమతిచ్చింది. అయితే 30శాతం సీటింగ్ సామర్థ్యంతోనే థియేటర్లను నడపాలని స్పష్టం చేసింది.
మార్గదర్శకాల ప్రకారం.. ఒక్కో సీటును విడిచి టికెట్లు అమ్మాలి. థియేటర్లో ప్రతి ఒక్కరు కనీసం ఒక మీటరు భౌతిక దూరాన్ని పాటించాలి. టికెట్ కొనేవారు తమ అసలు పేరు రిజిస్టర్ చేసుకోవాలి.
కరోనా నిబంధనలను కఠినంగా పాటించాలని చైనా సినీ రంగ యంత్రాంగం పేర్కొంది. ఒకవేళ తాము ఉండే ప్రాంతంలో వైరస్ వ్యాప్తి.. మోస్తరు నుంచి అత్యధిక తీవ్రత స్థాయికి పెరిగితే వెంటనే కార్యకలాపాలను మూసివేయాలని తేల్చిచెప్పింది.
ప్రపంచ సినీ రంగంలో.. హాలీవుడ్ తర్వాతి స్థానం చైనాదే. 2018లో 10 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. దేశవ్యాప్తంగా 70వేలకుపైగా సినిమా హాళ్లు ఉన్నాయి.
ఇదీ చూడండి:- అనుమతి లేకుండానే మనుషులకు వ్యాక్సిన్!