ప్రపంచ దేశాల్లో కరోనా టీకా పంపిణీ కొనసాగుతున్న వేళ.. మహమ్మారి కట్టడికి చైనా పడరాని పాట్లు పడుతోంది. క్రమంగా పెరుగుతున్న కేసులతో సతమతమవుతూ.. రోగుల కోసం పెద్దఎత్తున క్వారంటైన్ కేంద్రాలను కూడా నిర్మిస్తోంది.
అయితే చైనాలో వచ్చే నెలలో లూనార్ నూతన సంవత్సరం వేడుకలు జరగనున్నాయి. ఈ తరుణంలో వైరస్ వ్యాప్తి అధికమయ్యే అవకాశం ఉందని భావించిన ప్రభుత్వం.. ప్రజల రాకపోకలపై నిషేధం విధించే దిశగా అడుగులు వేసింది. విమాన ప్రయాణం కోసం ఇది వరకే టికెట్లు బుక్ చేసుకున్న వారికి.. నగదును తిరిగి చెల్లించాలని నిర్ణయించింది. ఈ మేరకు విమానయాన అధికారులు వెల్లడించారు.
తైవాన్‌లో మళ్లీ కరోనా కలకలం
తైవాన్‌లో ఓ ఆసుపత్రిలో 15 మందికి కరోనా సోకడం వల్ల అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. తొలుత ఆ ఆసుపత్రిలో దంపతులకు వైరస్ నిర్ధరణ అయ్యింది. ఈక్రమంలో ఆసుపత్రిలో వారికి సంబంధం ఉన్న 5000 మందిని క్వారంటైన్‌కు తరలించారు.
కాగా కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి తైవాన్‌లో 900కేసులు, కేవలం 7 మరణాలే నమోదుకావడం గమనార్హం.
ఇదీ చూడండి: భారీ క్వారంటైన్ కేంద్రం నిర్మిస్తున్న చైనా