భారత్, చైనా ఒకదానిపై ఒకటి ఆధిపత్యం చూపడం ఆపేయాలన్నారు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి. పరస్పర అనుమానం వీడాలని చెప్పారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం ద్వారా అనుకూల పరిస్థితులు ఏర్పరచి సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. తూర్పు లద్దాఖ్‌లో ప్రతిష్టంభన నేపథ్యంలో ఇరుదేశాల సంబంధాలపై ఆదివారం ఓ సమావేశంలో మాట్లాడారు వాంగ్.
"సరిహద్దు వివాదం మనకు చరిత్ర మిగిల్చింది. భారత్, చైనా సంబంధాలంటే సరిహద్దు వివాదం మాత్రమే కాదు. చాలా అంశాలపై ఇరు దేశాల వైఖరి ఒక్కటే. కాబట్టి రెండూ మిత్ర దేశాలు, భాగస్వాములే కానీ శత్రువులు, ప్రత్యర్థులు కావు. వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం రెండు దేశాలకూ ఉంది."
- వాంగ్ యి, చైనా విదేశాంగ మంత్రి
ఇరు దేశాల మధ్య ఘర్షణకు దారితీసిన అన్ని ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణ ద్వారా సరిహద్దుల్లో శాంతి స్థాపన జరిగిందన్నారు వాంగ్. ఈ పరిణామం రెండు దేశాల మధ్య సంబంధాల పునరుద్ధరణకు దోహదపడుతుందని వాంగ్ యూ ఆశాభావం వ్యక్తం చేశారు.
భారత్, చైనా ఒకదానినొకటి ముప్పుగా కన్నా అభివృద్ధికి అవకాశంగా పరిగణించాలని వాంగ్ అన్నారు. చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. అయితే చైనా సార్వభౌమాధికారాలను ఎట్టిపరిస్థితుల్లో వదులుకునేది లేదన్నారు.
ఇదీ చూడండి: 'మాకు ఓటేయకుంటే విద్యుత్తు, మంచి నీరు కట్'