కరోనా మహమ్మారి పుట్టినిల్లు చైనాలో మరోసారి కొవిడ్ కలకలం రేపుతోంది(china covid latest news). ఈ ఏడాది ఆగస్టులో నాన్జింగ్‌లో కరోనా వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగించగా.. ఆ తరువాత చైనాలో మరోసారి కొవిడ్ కలకలం రేపుతోంది. తాజాగా 40 లక్షలకుపైగా జనాభా గల లాన్జౌ నగరంలో(lanzhou city news) లాక్‌డౌన్ విధించారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలు బయటకు రావడానికి వీల్లేదని ఆదేశాలు జారీ చేశారు. స్థానికంగా కరోనా వ్యాప్తిని అదుపు చేసేందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
కరోనా కేసులు పెరుగుతుండటం వల్ల బీజింగ్ మారథాన్‌ను నిరవధికంగా వాయిదా వేశారు. 1981 నుంచి నిర్వహిస్తున్న బీజింగ్ మారథాన్.. చైనాలో జరుపుకునే అతి పెద్ద క్రీడోత్సవాలలో ఒకటి. అక్టోబర్ 31న జరగాల్సి ఉన్న ఈ మారథాన్‌లో దాదాపు 30,000 మంది పాల్గొంటారని అంచనా. కొవిడ్ వ్యాప్తికి అవకాశం ఉందని భావిస్తూ రన్నర్స్, సిబ్బంది, స్థానికుల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా ఈ మారథాన్‌ను నిలిపివేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.
కొవిడ్ పరీక్షల కోసం బీజింగ్వాసులు పెద్ద ఎత్తున బారులుతీరారు. అవసరమైతే తప్ప ప్రజలు నగరం వదిలి వెళ్లరాదని ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
వింటర్ ఒలింపిక్స్ వేళ..
2022 వింటర్ ఒలింపిక్స్‌కు కూడా చైనా ఆతిథ్యం ఇవ్వనుంది(winter olympics 2022). ఈ నేపథ్యంలో చైనా జీరో-కొవిడ్ విధానం అమలుపై అనుమానాలు తలెత్తుతున్నాయి. తాజాగా కొవిడ్ వ్యాప్తి నియంత్రణకు చైనా ప్రయాణాలపై ఆంక్షలు విధించింది. టెస్టుల సంఖ్యను పెంచింది. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేసింది. కొవిడ్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనలపై నిషేధం విధించింది. ఆస్ట్రేలియా లాంటి దేశాలు జీరో-కొవిడ్ విధానం నుంచి పక్కకు తప్పుకుని వైరస్‌తో కలిసి జీవించే విధానానికి మారాయి. కానీ చైనా, జీరో-కొవిడ్ వ్యూహానికే కట్టుబడి ఉంది. కఠినమైన లాక్‌డౌన్‌లు, అధిక సంఖ్యలో టెస్టులు, భారీ స్థాయిలో వ్యాక్సినేషన్ విధానాలను అమలు చేస్తోంది. గత శనివారానికి ఆ దేశ జనాభాలో 75.6 శాతానికి రెండు డోసుల వ్యాక్సిన్ వేశారు.
ఇదీ చూడండి:- కరోనాతో చైనా హై అలర్ట్- మూడేళ్ల పిల్లలకూ టీకా