చైనాలో చిన్న పిల్లలపై కత్తితో దాడులకు తెగబడ్డాడో వ్యక్తి. గ్వాంగ్జీ జువాంగ్ రాష్ట్రం.. బైలూ నగరంలోని కిండర్ గార్డెన్లో బుధవారం మధ్యాహ్నం ఈ ఘాతుకం జరిగినట్లు షిన్హువా న్యూస్ ఏజెన్సీ తెలిపింది.
బాలల గృహంలోకి కత్తితో ప్రవేశించిన దుండగుడు ఈ దాడికి తెగబడ్డాడు. ఘటనలో ఇద్దరు పిల్లలు మరణించగా.. మరో 16 మంది గాయపడ్డారని చైనా ప్రభుత్వ మీడియా తెలిపింది. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దాడికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
కత్తులతోనే..
కొన్నేళ్లుగా చైనాలో ఈ తరహా దాడులు పెరిగిపోయాయి. మానసిక అనారోగ్యంతో సతమతమయ్యే వారు.. వ్యక్తిగతంగా పగ పెంచుకునే వ్యక్తులు ఈ ఘాతుకాలకు పాల్పడుతుంటారని నిపుణులు తెలిపారు.
దేశంలో తుపాకులపై కఠిన ఆంక్షలు ఉన్నప్పటికీ.. కత్తుల వాడకాన్ని నియంత్రించలేకపోతోంది చైనా. ఈ తరహా దాడుల్లో ఎక్కువగా కత్తులే వినియోగించడం గమనార్హం.
ఇవీ చదవండి: 'భారత్‌ను దెబ్బకొట్టేందుకు చైనా కొత్త ఎత్తులు'