దక్షిణాసియాలో ప్రాబల్యాన్ని పెంచుకునే దిశగా చైనా కీలక ముందడుగు వేసింది. చైనా-దక్షిణాసియా దేశాల బృందం పేరుతో ఇటీవల కొత్త కూటమిని ఏర్పాటుచేసింది. డ్రాగన్‌తో పాటు అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్థాన్, శ్రీలంక ఇందులో సభ్య దేశాలుగా ఉన్నాయి. పేదరిక నిర్మూలన, అత్యవసర సరఫరాల నిల్వ వంటివి నూతన కూటమి ప్రధాన లక్ష్యాలని బయటకు చెబుతున్నారు. సార్క్ స్ఫూర్తికి తూట్లు పొడవడంతో పాటు ప్రాంతీయంగా భారత్‌కు చెక్ పెట్టేందుకే డ్రాగన్ దీన్ని తెరమీదకు తీసుకొచ్చిందన్న విశ్లేషణలు జోరెత్తుతున్నాయి. దక్షిణాసియా నాయకత్వ పగ్గాలను ఇండియా నుంచి లాగేసుకునేందుకు చైనా కుట్ర పన్నిందనే వార్తలు వినిపిస్తున్నాయి.
అదను చూసి...
భూమిపై జనసాంద్రత అత్యధికంగా ఉన్న ప్రాంతం దక్షిణాసియా. మొత్తం ప్రపంచ జనాభాలో దాదాపు 23శాతం ఇక్కడే ఉంది. 'దక్షిణాసియా దేశాల ప్రాంతీయ సహకార సంఘం'(సార్క్) పేరుతో ఇక్కడి దేశాలు 1985లో ప్రత్యేక కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి. భారత్, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్థాన్, శ్రీలంక, మాల్దీవులు, భూటాన్ అందులో సభ్యదేశాలు. భారత్, పాక్‌ల మధ్య ఉద్రిక్తతలతో కొన్నేళ్లుగా సార్క్ అచేతనస్థితిలో ఉంది. మరోవైపు కొవిడ్ మహమ్మారి కారణంగా దక్షిణాసియా దేశాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ఏడాది తొలినాళ్లలో పొరుగు దేశాలకు ఇండియా టీకా డోసులను ఎగుమతి చేసినప్పటికీ, తరవాత పరిస్థితులు మారిపోయాయి. స్వదేశంలో కొరత ఏర్పడటంతో ఎగుమతులను రద్దుచేసింది. నెలకు 50 లక్షల కొవిషీల్డ్ డోసులను అందించేలా బంగ్లాదేశ్‌తో ముందే చేసుకున్న ఒప్పందాన్నీ పక్కనపెట్టింది. దాంతో ఆ దేశంలో మొదటి డోసు తీసుకున్నవారిలో చాలామందికి రెండోడోసు అందుబాటులో లేకుండా పోయింది. దానిపై తీవ్ర దుమారం చెలరేగింది. దక్షిణాసియాలోని ఇతర దేశాలూ వ్యాక్సిన్ల కొరతతో ఇబ్బంది పడుతున్నాయి.
భారత్‌ను దూరంపెట్టి..
ఈ ప్రాంతంపై పట్టు కోసం ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న డ్రాగన్- తాజా పరిస్థితులను బృహత్తర అవకాశంగా భావించింది. వేగంగా పావులు కదిపింది. టీకా సరఫరా చేస్తామంటూ ముందుకొచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో అఫ్గాన్, బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్థాన్, శ్రీలంక విదేశాంగ మంత్రులతో వర్చువల్ సమావేశాన్ని ఏర్పాటుచేసింది. 'చైనా-దక్షిణాసియా దేశాల బృందం' భావనను ప్రతిపాదించింది. కొత్త కూటమిని అవతరింపజేసింది. సార్క్‌లోని ఇతర సభ్యదేశాలైన భారత్, భూటాన్, మాల్దీవులను దానికి దూరంగా ఉంచింది. దక్షిణాసియా గురించి మాట్లాడుతూ భారత్‌ను దూరంపెట్టడంపైనే అనేక అనుమానాలు రేగుతున్నాయి. పేదరిక నిర్మూలనే తమ బృందం ప్రధాన లక్ష్యమని చైనా చెబుతోంది. అదే నిజమైతే- దక్షిణాసియా దేశాల్లోకెల్లా అత్యధిక సంఖ్యలో పేదలు ఇండియాలోనే ఉన్నారు. అలాంటప్పుడు భారత్‌ను కలుపుకొని వెళ్ళకపోవడంలో అంతరార్థమేమిటి? దక్షిణాసియాలో ప్రబలశక్తి అయిన ఇండియాను సమర్థంగా ఎదుర్కోవాలంటే- దాని ఇరుగుపొరుగు దేశాలు తమ చెప్పుచేతల్లో ఉండటం చాలా అవసరమని చైనా నాయకత్వం భావిస్తోంది. ఆ కుయుక్తుల్లో భాగంగానే కొవిడ్ సంక్షోభం ముసుగులో పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకొనే ప్రయత్నాలకు దిగిందని పలువురు దౌత్యవేత్తలు, భద్రతా నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ప్రస్తుతానికి భూటాన్, మాల్దీవులు కొత్త కూటమిలో చేరలేదు. త్వరలోనే ఆ దేశాలూ నూతన బృందంతో చేతులు కలిపే అవకాశాలు లేకపోలేదు. చైనా ఇటీవల భూటాన్‌కు 50 వేల టీకా డోసులను పంపించింది. తాజా కూటమిలోని సభ్య దేశాలన్నీ చైనా ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న 'బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్'(బీఆర్‌ఐ)లో భాగస్వామ్యం కలిగినవే. బీఆర్‌ఐపై మాల్దీవులు సంతకం చేసింది కాబట్టి నేడో రేపో ఆ దేశమూ తాజా కూటమిలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. తాలిబన్లు సైతం ఈ కూటమిని తిరస్కరించే అవకాశం లేదు. వారికి చైనా పరోక్షంగా సహకరిస్తోందన్నది బహిరంగ రహస్యమే!
అప్రమత్తత అవసరం
అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలతో కలిసి భారత్- చతుర్భుజ కూటమి(క్వాడ్)ని ఏర్పాటుచేసుకోవడంతో దానికి ప్రతిగా డ్రాగన్ తాజా ఎత్తుగడ వేసిందన్న విశ్లేషణలూ వినిపిస్తున్నాయి. నూతన బృందాన్ని 'ఉత్తర హిమాలయాల క్వాడ్'గా అభివర్ణిస్తున్నారు. మాల్దీవులు, పాకిస్థాన్, శ్రీలంకల్లో చైనా అత్యధికంగా పెట్టుబడులు పెడుతోంది. బంగ్లాదేశ్‌కు అతిపెద్ద సైనిక సంపత్తి సరఫరాదారు డ్రాగనే. ఆ దేశంతో చైనా వాణిజ్య విలువ భారత్‌తో పోలిస్తే రెండింతలు ఎక్కువ. నేపాల్‌తో అనుసంధానతను పెంచుకొనే ప్రయత్నాలనూ చైనా ముమ్మరం చేసింది. ఇరు దేశాల మధ్య రైల్వే మార్గం నిర్మాణ అవకాశాలను పరిశీలిస్తోంది. మాల్దీవులతో వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకుంది. 2008లో మాల్దీవులతో భారత వాణిజ్య విలువ- ఆ దేశంతో చైనా వాణిజ్య విలువ కంటే 3.4 రెట్లు ఎక్కువ. దశాబ్దం తిరిగేసరికి ఆ పరిస్థితి మారిపోయింది.
పెట్టుబడుల ఎత్తుగడతో!
మరోవైపు చైనా-పాకిస్థాన్ ఆర్థిక నడవా(సీపీఈసీ)ను అఫ్గానిస్థాన్‌కు విస్తరించాలని డ్రాగన్ యోచిస్తోంది. భారత్‌కు విశ్వసనీయంగా ఉండే శ్రీలంక సైతం కొన్నాళ్లుగా చేజారిపోతోంది. హిందూ మహాసముద్రంలో వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హంబన్‌టొటా ఓడరేవును డ్రాగన్‌కు శ్రీలంక 99 ఏళ్లపాటు లీజుకు అప్పగించింది. అఫ్గాన్, బంగ్లాదేశ్, మాల్దీవులు, పాకిస్థాన్, నేపాల్, శ్రీలంకల్లో కొత్తగా 10 వేల కోట్ల డాలర్ల మేరకు పెట్టుబడులు పెట్టేందుకు చైనా సిద్ధమవుతోంది. ఆయా దేశాలపై తన పట్టును మరింత పెంచుకొనేందుకు తాజాగా కొత్త కూటమిని ముందుకుతెచ్చింది. కావాలనుకుంటే చైనా నేతృత్వంలోని దక్షిణాసియా బృందంలో భారత్ సైతం చేరవచ్చని బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి అబ్దుల్ మొమొన్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఇండియాను దూరం పెట్టాలని తామేమీ భావించడం లేదన్నారు. భారత్ లక్ష్యంగానే చైనా ఈ కూటమిని తెరపైకి తెచ్చిందని స్పష్టమవుతున్నప్పుడు అందులో చేరడమనే చర్చే ఉత్పన్నం కాదు. ఈ పరిస్థితుల్లో భారత్ అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలి. డ్రాగన్ విస్తరణ ప్రణాళికలను వ్యూహాత్మకంగా అడ్డుకోవాలి. దక్షిణాసియా దేశాలకు స్నేహహస్తం అందిస్తూ... అవి దూరంకాకుండా చూసుకోవాలి.
సార్క్ పునరుద్ధరణే మార్గమా?
భారత్-పాక్ మధ్య విభేదాల కారణంగా సార్క్ అటకెక్కింది. కూటమి శిఖరాగ్ర సదస్సు చివరగా 2014లో నేపాల్‌లో జరిగింది. సార్క్‌ను పునరుద్ధరించేందుకు ఇండియా ఆసక్తి చూపడంలేదు. దానికి ప్రత్యామ్నాయంగా మరో ప్రాంతీయ కూటమి 'బే ఆఫ్ బెంగాల్ ఇనీషియేటివ్ ఫర్ మల్టీ-సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోపరేషన్'(బిమ్‌స్టెక్)కు ప్రాధాన్యమిస్తోంది. అందులో పెట్టుబడులను పెంచుతోంది. దక్షిణాసియా దేశాలన్నింటినీ ఏకం చేసే వేదికగా 'బిమ్‌స్టెక్' నిలవబోదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దానికి అధిక ప్రాధాన్యమివ్వడానికి బదులు సార్క్‌ను పునరుద్ధరిస్తే చైనా దూకుడును మరింత మెరుగ్గా అడ్డుకోవచ్చని సూచిస్తున్నారు.
- మండ నవీన్ కుమార్ గౌడ్
ఇదీ చూడండి: భారత్‌పై పోరుకు చైనా పన్నాగం!
ఇదీ చూడండి: భారత్-చైనా సమస్యకేదీ పరిష్కారం?