హాంకాంగ్‌లో ప్రజాస్వామ్యవాదుల నిరసనలు హింసాత్మకంగా మారాయి. క్వాయ్ త్సింగ్, సుయెన్ వాన్ జిల్లాల్లో నిరసనకారులు చేపట్టిన ఓ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ఈ చర్యతో ఆగ్రహించిన నిరసనకారులు.. పోలీసులపై రాళ్లు, ఇనుపరాడ్లు, పెట్రోల్ బాంబులతో విరుచుకుపడ్డారు. కొందరు పోలీసులను తీవ్రంగా కొట్టారు.
నిబంధనల ఉల్లంఘన
ఈ ఘటనపై హాంకాంగ్ ప్రభుత్వం తీవ్రంగా మండిపడింది. అనుమతించిన మార్గంలో కాకుండా వేరే మార్గాల్లోనూ నిరసనలు చేపట్టారని పేర్కొంది.
"క్వాయ్ త్సింగ్, సుయెన్ వాన్ జిల్లాల్లో శాంతియుత ర్యాలీ చేపట్టడానికి పోలీసుల నుంచి ఆందోళనకారులు అనుమతి పొందారు. అయితే కొంత మంది నిరసనకారులు అనుమతించిన మార్గంలో కాకుండా వేరే మార్గాల్లోనూ ర్యాలీలు చేపట్టారు. అడ్డుకున్న పోలీసులపై తీవ్రంగా దాడి చేశారు. వారి వాహనాలపై పెట్రోల్ బాంబులు వేశారు. దుకాణాలను ధ్వంసం చేశారు."- హాంకాంగ్ ప్రభుత్వ అధికార ప్రతినిధి
హింసాత్మక ఘటనలు షామ్ షుయ్పో, సిమ్ షా, క్రాస్ హార్బర్ టన్నెల్‌కు చెందిన కౌలూన్ ప్రాంతాలకూ వ్యాపించాయి.
చైనా జాతీయ పతాకాన్ని తొక్కేశారు
క్వాయ్ చుంగ్ క్రీడామైదానంలోని చైనా జాతీయ పతాకాన్ని తొలగించారు ఆందోళనకారులు.
సార్వభౌమత్వాన్ని ధిక్కరించడమే..
నిరసనకారుల హింసాత్మక చర్యలను హాంకాంగ్ ప్రభుత్వం ఖండించింది. జాతీయ పతాకాన్ని, జాతీయ చిహ్నాలను అవమానించడం... దేశ సార్వభౌమత్వాన్ని ధిక్కరించడమే అవుతుందని పేర్కొంది. బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించింది.
ఇదీ చూడండి: గాంధీ-150: ఆచరణాత్మక ఆదర్శవాది 'బాపూ'