హాంకాంగ్ పౌరులకు బ్రిటన్ ఇస్తామంటున్న బ్రిటీష్ నేషనల్ ఓవర్సీస్ (బీఎన్ఓ) వీసాలు, పాస్‌పోర్టుల్ని తాము గుర్తించమని చైనా చెప్పింది. వీటిని ప్రయాణ ధ్రువపత్రాలుగా అంగీకరించమని తేల్చేసింది. పూర్వ బ్రిటీష్ కాలనీ అయిన హాంకాంగ్‌లో చైనా గత ఏడాది ఏకపక్షంగా జాతీయ భద్రతా చట్టం ప్రయోగించడం వల్ల అక్కడ నిరసనలు మిన్నంటాయి. ప్రజాస్వామ్య అనుకూల ఉద్యమాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో హాంకాంగ్ పౌరులకు ఆశ్రయం కల్పించేందుకు, క్రమంగా వారికి పౌరసత్వం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు బ్రిటన్ శుక్రవారం ప్రకటించింది. బీఎన్ఓ వీసాల కోసం ఆదివారం నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపింది.
హాంకాంగ్ వాసులకు లబ్ధి..
బీఎన్ఓ వీసా ద్వారా 54 లక్షల మంది హాంకాంగ్ వాసులు ఐదేళ్లపాటు బ్రిటన్‌లో నివసించేందుకు, ఉపాధి పొందేందుకు అర్హులవుతారు. ఆ తర్వాత వారంతా బ్రిటిష్ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. బ్రిటన్ ప్రకటన చేసిన గంటల వ్యవధిలోనే డ్రాగన్ స్పందించింది. బ్రిటన్ ప్రకటన చైనా సార్వభౌమత్వాన్ని ఉల్లంఘిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. హాంకాంగ్ వ్యవహారాలు, చైనా అంతర్గత అంశాల్లో మరో దేశం జోక్యం చేసుకోవడం.. అంతర్జాతీయ న్యాయసూత్రాలను బేఖాతరు చేయడమేనని వ్యాఖ్యానించింది.
ఇదీ చదవండి : చైనాలో మలద్వార స్వాబ్ పరీక్షలు