నూతన అంతరిక్ష కేంద్రం ద్వారా చైనా చేపట్టబోయే ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నట్టు ఆ దేశం గురువారం తెలిపింది. తియాన్‌ఝౌ-2 కార్గో అంతరిక్ష నౌకను గురువారం తెల్లవారుజామున ప్రయోగించాలని తొలుత భావించారు. కానీ, సాంకేతిక కారణాల వల్ల మిషన్‌ను పంపించలేకపోతున్నామని స్పష్టం చేస్తూ.. చైనా మ్యాన్డ్ స్పేస్ తన వెబ్సైట్లో రాసుకొచ్చింది. ఈ ప్రయోగాన్ని మళ్లీ ఎప్పుడు చేపడతారనే వివరాలు అందులో పేర్కొనలేదు.
చైనా అంతరిక్ష కేంద్రం నుంచి గత నెల 29న ప్రయోగించిన ప్రధాన తియాన్హె మాడ్యూల్‌కు వెళ్లే మొదటి మిషన్ ఇది. మరో రెండు మాడ్యూల్స్ ద్వారా.. మిషన్‌కు సంబంధించిన వివిధ భాగాలు, సామగ్రితో సహా ముగ్గురు సిబ్బందిని పంపనున్నారు. ఇందుకోసం మొత్తం 10 ప్రయోగాల ప్రణాళికను సిద్ధం చేశారు శాస్త్రవేత్తలు.
ఆ దేశం చేపట్టిన తియాన్హే(హెవెన్లీ హార్మోనీ) ప్రయోగం విజయవంతమైందని భావించినప్పటికీ.. అది నీటి మీద కాకుండా నేలపై కూలుతుందనే విషయమై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ప్రయోగంపై అమెరికా పరిశోధనా కేంద్రం(నాసా) తీవ్రస్థాయిలో మండిపడింది. అంతరిక్ష ప్రయోగాలలో బాధ్యతాయుతమైన ప్రమాణాలను పాటించడంలో చైనా విఫలమైందని నాసా అడ్మినిస్ట్రేటర్ సెన్.బిల్ నెల్సన్ అన్నారు.
2003లో తొలిసారిగా అంతరిక్షంలోకి వ్యోమగామిని పంపినప్పటి నుంచి చాలా తక్కువ సార్లు వైఫల్యాలను చవిచూసింది చైనా. మార్చ్ 5బీ రాకెట్ విఫలం కావడం వల్ల.. ఈ ప్రయోగాన్ని ఆలస్యం చేసింది.
ఇదీ చదవండి: అంగారక గ్రహంపై తొలిసారి చైనా అంతరిక్ష నౌక