China Covid Cases: కరోనా మహమ్మారి పుట్టినిల్లు చైనాలో గత కొన్ని రోజులుగా మళ్లీ వైరస్ విజృంభిస్తోంది. శుక్రవారం అక్కడ రికార్డు స్థాయిలో 1300కు పైగా కేసులు నమోదయ్యాయి. రోజువారీ కేసులు వెయ్యికి పైనే ఉండటం గత రెండేళ్లలో ఇదే తొలిసారి అని అధికారులు వెల్లడించారు. మూడు వారాల క్రితం వరకు 100కు దిగువనే ఉన్న కేసుల సంఖ్య కొద్ది రోజులుగా క్రమక్రమంగా పెరుగుతున్నాయి. శుక్రవారం విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం.. 24 గంటల వ్యవధిలో 1369 కొత్త కేసులు బయటపడ్డాయి. దేశవ్యాప్తంగా డజనకు పైగా ప్రావిన్సుల్లో కరోనా వ్యాప్తి పెరుగుతున్నట్లు అధికారులు తెలిపారు.
చాంగ్‌చున్‌లో లాక్‌డౌన్..
ఈశాన్య నగరమైన చాంగ్‌చున్‌లో వైరస్ ఉద్ధృతి ఎక్కువగా ఉంది. దీంతో అధికారులు అక్కడ శుక్రవారం నుంచి లాక్‌డౌన్ విధించారు. 90లక్షల జనాభా కలిగిన ఈ నగరంలో వ్యాపారాలు మూసివేశారు. రవాణాను నిలిపివేశారు. ప్రజలంతా తప్పనిసరిగా ఇంట్లోనే ఉండాలని అధికారులు ఆదేశించారు. వైరస్ కట్టడిలో భాగంగా నగరమంతా సామూహిక పరీక్షలు చేయనున్నట్లు వెల్లడించారు. షాంఘై, ఇతర నగరాల్లోనూ లాక్‌డౌన్ తరహా ఆంక్షలను అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు.
బందీలుగా ఉంచి మరీ పరీక్షలు..
కరోనా కట్టడికి జీరో కొవిడ్ వ్యూహాన్ని అమలు చేస్తోన్న చైనా ఒక్క కేసు నమోదైనా లక్షల కొద్దీ పరీక్షలు చేస్తోంది. ఇప్పుడు వెయ్యికి పైగా కేసులు బయటపడటంతో టెస్టులను మరింత పెంచింది. షాంఘైలోని కొన్ని ప్రాంతాల్లో విద్యాసంస్థలను లాక్ చేసి అందులోని విద్యార్థులు, టీచర్లను బందీలుగా ఉంచి మరీ పరీక్షలు చేస్తున్నట్లు కొన్ని కథనాలు వస్తున్నాయి. టెస్టులు పూర్తయ్యేవరకు వీరంతా అక్కడే ఉండాలని అధికారులు ఆదేశించినట్లు సమాచారం. ఇక రెస్టారంట్లు, మాల్స్‌లోనూ పరీక్షలు పూర్తయ్యేంతవరకు సందర్శకులను బయటకు పంపించట్లేదని సదరు కథనాలు పేర్కొంటున్నాయి.
ఇదీ చూడండి: ఉక్రెయిన్‌పై భీకర దాడులు.. రంగంలోకి విదేశీ ఫైటర్లు!