గతేడాది డిసెంబర్లో చైనాలో పుట్టిన కరోనా వైరస్‌పై పరిశోధించిన అధ్యయనాలు ఆసక్తికర విషయాలను వెల్లడించాయి. ఫిబ్రవరి మధ్య నాటికే ఆ దేశంలో సుమారు 2.32 లక్షల వైరస్ కేసులు ఉన్నాయని తెలిపాయి. అయితే చైనా అధికారికంగా ప్రకటించిన దానికంటే ఈ సంఖ్య నాలుగు రెట్లు అధికం.
చైనాలో వైరస్ కేసులను లెక్కించే ప్రమాణాలపై అధ్యయనం చేశామని హాంకాంగ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు చెప్పారు. దీన్నిబట్టి ఆ దేశంలో ఫిబ్రవరిలోనే 2,32,000 మందికి వైరస్ సోకి ఉంటుందని అంచనా వేశామన్నారు.
ఒక్కసారిగా లెక్కలు మార్చిన చైనా..
చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ ప్రకటించిన అధికారిక గణాంకాల ప్రకారం.. దేశంలో ఇప్పటివరకు 82,798 కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారినపడి 4,632 మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్ కేంద్రబిందువైన వుహాన్‌లో మృతుల సంఖ్యను ఏప్రిల్ 17న ఒక్కసారిగా 1,290కు పెంచింది చైనా. దీంతో నగరంలో మొత్తం మృతుల సంఖ్య 3,869కు చేరింది.
కొవిడ్ కేసులను తక్కువగా ప్రకటిస్తూ, తప్పుడు సమాచారం ఇస్తోందని చైనాపై ఇప్పటికే అమెరికా, ఐరోపా దేశాలు గుర్రుగా ఉన్నాయి.
ఇదీ చదవండి: మిత్రుల ఇంట్లో భోజనం చేసిన మంత్రి సస్పెన్షన్!