విస్తరణ కాంక్షతో రగిలిపోతున్న చైనా తన అణ్వస్త్ర సామర్థ్యాలను మరింత బలోపేతం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను దాచి ఉంచేందుకు వీలుగా ఆ దేశం కొత్తగా 119 టవర్ల వంటి నిర్మాణాలను (సిలోలు) ఏర్పాటు చేసుకుంటోంది. బీజింగ్‌కు దాదాపు 2,100 కిలోమీటర్ల దూరంలో, గాన్సూ ప్రావిన్సులోని ఓ ఎడారిలో వాటన్నింటినీ ఒకే ఆకృతిలో నిర్మిస్తున్నట్లు ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా స్పష్టమవుతోందని అమెరికాకు చెందిన 'వాషింగ్టన్ పోస్ట్' వార్తాసంస్థ ఓ కథనంలో వెల్లడించింది.
అమెరికా ప్రధాన భూభాగాన్ని తాకగల శక్తిమంతమైన ఆయుధాలను ఈ టవర్లలో ఉంచే అవకాశముందని 'వాషింగ్టన్ పోస్ట్' తెలిపింది. డ్రాగన్ వద్ద ఇప్పటికే 250-350 అణ్వాయుధాలు ఉన్నట్లు అంచనాలున్న సంగతిని గుర్తుచేసింది. కొత్తగా ఎన్ని క్షిపణులను సమకూర్చుకొని.. ప్రస్తుతం నిర్మిస్తున్న టవర్లలో భద్రపరుస్తుందన్న దానిపై స్పష్టత లేదని పేర్కొంది.
ఇదీ చూడండి: ఆ దేశాలకు చైనా తీవ్ర హెచ్చరిక!
ఇదీ చూడండి: 'భారత సైన్యం సత్తా ఏంటో చైనాకు అర్థమైంది'