కరోనా విజృభిస్తున్న వేళ స్వదేశానికి రాలేనని లాహోర్ కోర్టుకు తెలిపారు పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్. ఆరోగ్య పరిస్థితి అంతంతమాత్రంగానే ఉన్న నేపథ్యంలో వైరస్ బారిన పడే ప్రమాదం ఉన్నందున బయటకు రావొద్దని వైద్యులు సూచించినట్లు కోర్టుకు తెలిపారు.
తన ఆరోగ్య పరిస్థితి సరిగా లేనందున మెరుగైన వైద్య కోసం లాహోర్ కోర్టు అనుమతితో గత ఏడాది నవంబర్‌లో లండన్‌కు వెళ్లారు షరీఫ్.
రక్తంలో ప్లేట్‌లెట్ల సంఖ్య తక్కువగా ఉందని, డయాబెటిస్, గుండె, మూత్రపిండాలు, రక్తపోటు సంబంధిత సమస్యలు ఉన్నాయని హైకోర్టుకు తన ఆరోగ్య పరిస్థితి గురించి నివేదిక సమర్పించారు షరీఫ్. ఇటువంటి పరిస్థితుల్లో బయటకు రావద్దని వైద్యులు సూచించినట్లు తెలిపారు.
ప్రధానిగా ఉన్నప్పుడు అధికార దుర్వినియోగం, అవినీతికి పాల్పడినట్లు ఆరోపణల నేపథ్యంలో ఆగస్టు 17న తమ ముందు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది పాకిస్థాన్ అవినీతి నిరోధక కోర్టు. ఈ తరుణంలో తన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా స్వదేశానికి రాలేకపోతున్నట్లు నివేదికను కోర్టులో సమర్పించారు షరీఫ్ తరపు న్యాయవాది అమ్జాద్ పెర్వైజ్.