కశ్మీర్ పరిణామాలతో కర్తార్‌పుర్ నడవాపై ఎలాంటి ప్రభావం పడకూడదని భారత్ భావిస్తోంది. నడవా ఏర్పాట్లపై పాకిస్థాన్ స్పందించని కారణంగా భారత ప్రభుత్వం మరోసారి ఈ విషయాన్ని గుర్తు చేసింది.
కర్తార్‌పుర్ నడవాపై ఆగస్టు మొదటివారంలో సాంకేతిక స్థాయి చర్చలు జరగాల్సి ఉంది. ఇప్పటికే ఈ విషయంపై పాక్‌కు సూచించింది భారత్. కానీ పొరుగు దేశం నుంచి సమాధానం లేకపోవటం వల్ల ఆ దేశానికి భారత్ నోటీసు పంపించినట్లు సమాచారం.
ఈ సమావేశంలో చర్చించాల్సిన అంశాలు
⦁ కర్తార్‌పూర్ నడవాకు వెళ్లే మార్గాన్ని అభివృద్ధి చేయడం.
⦁ నోడల్ పాయింట్ల మధ్య యాత్రికుల సమాచారం పరస్పర మార్పిడికి తగిన యంత్రాంగం.
⦁ మార్గాన్ని ఉపయోగించేటప్పుడు అత్యవసర యంత్రాంగం ఏర్పాటు.
ఇప్పటివరకు జరిగిన చర్చల్లో అనేక విషయాలపై ఇరు దేశాలు చర్చించాయి. భారత్ ప్రతిపాదించిన చాలా అంశాలను పాక్ అంగీకరించింది.
సిక్కు మత స్థాపకుడు గురు నానక్ దేవ్ జీవితంలో చివరి రోజులు గురుద్వారా దర్బార్ సాహిబ్‌లో గడిపారు. ఆయన 550వ జయంతి ఉత్సవాలు ఈ ఏడాది జరుగుతాయి. భారత దేశంలోని సిక్కులు పాకిస్థాన్‌లో ఉన్న ఈ పవిత్ర స్థలానికి వెళ్తారు. నవంబరులో ఈ నడవాను తెరవాల్సి ఉంది. పాకిస్థాన్ పంజాబ్‌లోని నరోవల్ జిల్లాలో కర్తార్‌పుర్ గురుద్వారా ఉంది.
ఇదీ చూడండి:'యే దోస్తీ' పాటతో ఇజ్రాయెల్ ఫ్రెండ్షిప్ డే విషెష్