యావత్ ప్రపంచానికి కొద్దిరోజులుగా కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది కరోనా. ఈ మహమ్మారి పుట్టినిల్లు చైనాలో వైరస్ బాధితులకు ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆసుపత్రులను క్రమంగా మూసేస్తోంది ఆ దేశం. చైనాలో కొవిడ్ కేసులు దాదాపుగా తగ్గిపోవడం వల్ల జిన్‌పింగ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
వుహాన్‌లో 16 ఆసుపత్రులు మూత..
వైరస్ కేంద్రబిందువైన వుహాన్‌లో ఇప్పటికే సుమారు 16 తాత్కాలిక ఆసుపత్రులను మూసివేయగా.. రాజధాని బీజింగ్‌లోని వైద్యశాలలనూ మూసివేయాలని చైనా నిర్ణయించింది. చైనాలో వైరస్ ఉద్ధృత దశకు చేరాక మార్చి 16 న బీజింగ్‌లోని జియాతాంగ్షాన్ ఆసుపత్రిని కరోనా ప్రత్యేక ఆసుపత్రిగా మార్చారు. ఇక్కడ చికిత్స పొందిన 19 మంది కరోనా బాధితులు పూర్తిగా కోలుకున్నందున బుధవారం ఈ ఆసుపత్రిని మూసివేయనున్నారు. 2003లో చైనాలో సార్స్ మహమ్మారి ప్రబలినపుడు వారం రోజుల్లో ఈ ఆసుపత్రిని నిర్మించారు.
ఇప్పటివరకు చైనాలో 82,836 కరోనా కేసులు నమోదవ్వగా.. 77,555 మంది కోలుకున్నారు. మరో 4,633 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చదవండి: సెప్టెంబర్ వరకు అందుబాటులోకి కరోనా వ్యాక్సిన్!