చైనాలో వేగంగా విస్తరిస్తూ వందలాది మంది ప్రాణాలు బలిగొంటున్న కరోనా వైరస్.. అప్పుడే పుట్టిన వారిని కూడా వదలడం లేదు. తాజాగా.. పుట్టిన 30 గంటలకే ఓ చిన్నారికి కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. ఇప్పటి వరకూ కరోనా వైరస్ బారిన పడిన వారిలో ఈ చిన్నారే అత్యంత పిన్న వయస్కురాలు కావడం గమనార్హం.
తల్లి నుంచి బిడ్డకు...
బిడ్డకు జన్మనివ్వడానికి ముందే తల్లి సైతం కరోనా బారిన పడింది. దీన్ని వెర్టికల్ ట్రాన్స్‌మిషన్‌గా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గర్భధారణ సమయంలో గానీ, ప్రసవ సమయంలో గానీ తల్లి నుంచి బిడ్డకు సంక్రమించే అంటువ్యాధులను ఇది సూచిస్తుంది. ఇప్పటికే హార్బిన్ నగరంలోనూ ఈ వైరస్ సోకిన ఓ గర్భిణి సోమవారం బిడ్డకు జన్మనివ్వగా ఆ శిశువుకు వైద్య పరీక్షల్లో నెగెటివ్‌గా తేలింది. ఇప్పటివరకు వైరస్ ధాటికి చైనాలో సుమారుగా 500 మందికి పైగా మరణించారు. ఇంకా వేలాది మందికి వైరస్ సోకినట్లు అక్కడి అధికారులు ప్రకటించారు.
ఇదీ చదవండి: 'సామాజిక మాధ్యమాలకు ఆధార్ లింక్.. నిజంకాదు'