ఆస్ట్రేలియాలో భీకర కార్చిచ్చు కొనసాగుతోంది. దావానలం ధాటికి శనివారం దక్షిణ ఆస్ట్రేలియాలో ఓ వ్యక్తి మరణించినట్లు అధికారులు తెలిపారు. 23 మంది అగ్నిమాపక సిబ్బంది సహా మరో 29 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. వాయువ్య సిడ్నీ, లిత్‌గో ప్రాంతాల్లో రెండు భవనాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఈ నేపథ్యంలో న్యూసౌత్ వేల్స్‌లోని 6 ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితిని విధించింది ప్రభుత్వం.
47 డిగ్రీల ఉష్ణోగ్రత...
కార్చిచ్చు వల్ల పలు ప్రాంతాల్లో వేడి గాలులు వీస్తున్నాయి. ఈ గాలుల ప్రభావానికి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. పశ్చిమ సిడ్నీలో 47 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. వేగంగా వీస్తోన్న గాలుల వల్ల మంటలు పలు ప్రాంతాలకు వ్యాప్తి చెందే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఈ ప్రస్తుత స్థితిని 'విపత్కర పరిస్థితి'గా అభివర్ణించారు.
2 వేల అగ్నిమాపక యంత్రాలు..
దేశవ్యాప్తంగా విస్తరిస్తోన్న దావానలాన్ని అదుపు చేసేందుకు ఆస్ట్రేలియా రక్షణ శాఖ సహా అమెరికా, కెనడా దేశాల సహాయంతో సుమారు 2 వేల అగ్నిమాపక వాహనాలు రంగంలోకి దిగాయి. అత్యవసర పరిస్థితులు నెలకొన్న ప్రాంతాల్లో 100 మందితో కూడిన 5 బృందాలను మోహరించారు అధికారులు.
40 వేల హెక్టార్ల భూమి ఆహుతి...
ఇప్పటి వరకు కార్చిచ్చు వల్ల దక్షిణ ఆస్ట్రేలియాలో 40 వేల హెక్టార్లు, అడిలైడ్ హిల్స్‌లో 25 వేల హెక్టార్ల భూమి ఆహుతైనట్లు అధికారులు ప్రకటించారు. అంతేకాకుండా 28 భవనాలు, 16 వాహనాలు దగ్ధమైనట్లు తెలిపారు. పశువులు, జంతువులు, పశుగ్రాసం, ద్రాక్ష తోటలకు గణనీయమైన నష్టం సంభవించినట్లు పేర్కొన్నారు
ప్రయాణాలు వాయిదా...
కార్చిచ్చు వల్ల అత్యవసర పరిస్థితిని విధించిన నేపథ్యంలో ప్రజలను సెలవు దినాల్లో తమ ప్రయణాలను నిలిపివేయాలని అధికారులు ప్రజలను కోరారు. ఈ మంటలకు పలు రహదారులు, రైలు మార్గాలను మూసివేశారు.
ఇదీ చూడండి: దిల్లీ దర్యాగంజ్ 'పౌర'అల్లర్లపై చర్యలు.. 15 మంది అరెస్ట్