అఫ్గానిస్థాన్ నుంచి ఆస్ట్రేలియా తమ సేనలను ఉపసంహరించుకుంది. తమ దళాలను స్వదేశానికి తీసుకువచ్చినట్లు ఆ దేశ రక్షణ మంత్రి పీటర్ డట్టన్ తెలిపారు. భవిష్యత్‌లో అమెరికా చేపట్టే ఏ మిలిటరీ మిషన్‌కైనా తమ తోడ్పాటు ఉంటుందని స్పష్టం చేశారు.
అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా సైన్యం ఉపసంహరణ ప్రక్రియ ఆగస్టు 31తో ముగియనున్న నేపథ్యంలో ఆస్ట్రేలియా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజా చర్యతో యూఎస్ సైన్యంతో కలిసి అఫ్గాన్‌లో 20 ఏళ్ల క్రితం చేపట్టిన మిలిటరీ మిషన్‌కు ఆస్ట్రేలియా ముగింపు పలికినట్లయింది.
అయితే అఫ్గాన్‌లో 80 మంది సైనికులను ఉంచింది ఆస్ట్రేలియా. కాబూల్‌లోని రాయబార కార్యాలయ రక్షణ, దౌత్య కార్యకలాపాలను నిర్వహించడానికి ఈ దళాలను ఉపయోగిస్తోంది.
అఫ్గానిస్థాన్ నుంచి యూఎస్ దళాలు త్వరలోనే పూర్తిస్థాయిలో వెదొలుగుతాయని భావించి.. తాలిబన్లు కొత్త ప్రాంతాలను మెరుపు వేగంతో స్వాధీనం చేసుకుంటున్నారు. అఫ్గాన్ ప్రభుత్వ దళాలు కూడా అక్కడి అనేక ప్రదేశాల నుంచి పారిపోతున్నాయి. భారత్ సైతం తమ దౌత్యవేత్తలను అఫ్గాన్ నుంచి స్వదేశానికి తీసుకొచ్చింది.
ఇదీ చదవండి:దళాల ఉపసంహరణతో పేట్రేగుతున్న తాలిబన్లు